హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ విపత్తుల స్పందన, ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ సంస్థ (హైడ్రా) పరిధి ఎంతవరకు? అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలపై ఉక్కుపాదం మోపడంలో దూకుడు ప్రదర్శిస్తున్న హైడ్రా పరిధి, దాని అధికారాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మా రాయి. హైడ్రా రూపకల్పనకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొన్న పరిధి.. జరుగుతున్న పరిణామాలు కొంత గందరగోళం కలిగిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి తన విజన్‌ను వివరిస్తూ.. నగరం చుట్టూ ఉన్న ఓఆర్ఆర్ వరకు అర్బన్ తెలంగాణ, రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) వరకు సెమీ అర్బన్ తెలంగాణ, ఆ వెలుపల గ్రామీణ తెలంగాణగా అభివర్ణించారు. అర్బన్ తెలంగాణలో ప్రభుత్వ భూము లు, చెరువుల పరిరక్షణకు హైడ్రాను ఏర్పాటుచేశారు. హైడ్రా పరిధి, అధికారాలు, విధులను ఖరారుచేస్తూ గత నెల 19న రాష్ట్ర ప్రభుత్వం జీవో 99 జారీచేసింది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పూర్తి పరిధి, ఓఆర్ఆర్ వరకు ఉన్న పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల వరకు హైడ్రా పరిధి అని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఈ పరిధిని పెంచడంగానీ, తగ్గించడంగానీ చేసే అవకాశం ఉందని కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక రంగంలోకి దిగిన హైడ్రా గత నెల రోజులుగా అక్రమ నిర్మాణాలు, చెరువుల కబ్జా పై ఉక్కుపాదం మోపుతున్నది. దీనిపై ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది. ఆక్రమణల విషయంలో ఎవరినీ ఉపేక్షించేదిలేదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రతి సందర్భంలో నూ ప్రకటిస్తున్నారు. కొన్నిరోజుల కిందట ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ నియోజకవర్గంలో ఒక పార్కు స్థలానికి సంబంధించి చోటుచేసుకున్న వివాదంలోనూ రంగనాథ్ ఢీ అంటే ఢీ అనే స్థాయిలో నిక్కచ్చిగా అడుగులు వేశారు. ఈ విషయంలో సీఎం నుంచి కూడా ఆయనకు మద్దతు లభించినట్టు వార్తలు వచ్చా యి. అయితే మొన్నటివరకు హైడ్రా ఔటర్ పరిధిలోనే ఈ కూల్చివేతల్ని చేపట్టింది. కాగా ఈ నెల 18న హైడ్రా యంత్రాంగం చేపట్టిన కూల్చివేతలతో అసలు దాని పరిధి ఎంతవరకు? అనే సందేహాలు మొదలయ్యాయి.
ఔటర్ దాటి పంచాయతీల్లో కూల్చివేతలు
18న గండిపేట ఎఫ్టీఎల్ పరిధిలోని ఆక్రమణల్ని హైడ్రా కూల్చివేసింది. నార్సింగి ము న్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్‌లో రెండు భారీ నిర్మాణాలను నేలమట్టం చేసింది. వాస్తవానికి ఖానాపూర్ ఓఆర్ఆర్కు అవతల ఉంటు ంది. కానీ ఆ గ్రామం ఓఆర్ఆర్కు ఇవతల ఉ న్న నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుం ది. అదేరోజు హైడ్రా యంత్రాంగం అప్పోజీగూడ గ్రామపంచాయతీ పరిధిలో మూడు, హిమాయత్‌నగర్, చిలుకూరు గ్రామపంచాయతీ పరిధిల్లో ఒకటి చొప్పున భారీ నిర్మాణాలను కూల్చివేసింది. దీంతో ప్రభుత్వం నిర్దేశించిన పరిధి ప్రకారం కాకుండా హైడ్రా ఓఆర్ఆర్ అవతల కూడా అక్రమ నిర్మాణాలు, చెరువుల కబ్జాపై ఉక్కుపాదం మోపుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
నార్సింగి వరకు హైడ్రా పరిధి
హైడ్రా పరిధిపై కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ.. ఓఆర్ఆర్ వరకు మాత్రమే హైడ్రా పరిధి అని స్పష్టంచేశారు. గండిపేట ఎఫ్టీఎల్ కూల్చివేతలను ప్రస్తావించినపుడు నార్సింగి మున్సిపాలిటీ ఔటర్ లోపల ఉన్నందున దాని పరిధి ఎంతవరకు ఉంటే అంతవరకు హైడ్రాలోకి వస్తుందని తెలిపారు. అయితే ఓఆర్ఆర్ అవతల ఉన్న మరో మూడు గ్రామ పంచాయతీ పరిధుల్లోనూ హైడ్రా కూల్చివేతలు చేపట్టడంపైనే అయోమయం నెలకొంది. ఓఆర్ఆర్ నుంచి హిమాయత్‌నగర్ సుమారు ఏడెనిమిది కిలోమీటర్లు, చిలుకూరు పది కిలోమీటర్లు, అప్పోజిగూడ 15 కిలోమీటర్ల దూ రం ఉంటాయి. అంటే ఓఆర్ఆర్ అవతల 15 కిలోమీటర్ల వరకు హైడ్రా వెళ్లింది. దీంతో అవుటర్ దాటిన తర్వాత కూడా హైడ్రా పరిధి వ స్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నా యి. జీవోలో పేర్కొన్నట్టు ప్రభుత్వం దాని పరిధిని పెంచొచ్చు, తగ్గించొచ్చు.. కానీ పెంచుతున్నట్టు ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు.
హైడ్రాకు ప్రజల నుంచి ఫిర్యాదులు
హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ భూములను కాపాడుతూ కబ్జాలకు గురవుతు న్న చెరువులు, కుంటలకు ప్రాణం పోసేందుకు హైడ్రా తనవంతు పాత్ర పోషిస్తుందని ఏవీ రంగనాథ్ వెల్లడించారు. హైడ్రాకు ప్రజల నుంచి స్వచ్ఛందంగా రోజూ 30 నుంచి 40 ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. గండిపేట చెరువును కబ్జా చేసి నిర్మించిన నిర్మాణాలపై, ఇతర ప్రాంతాలలోని అక్రమ నిర్మాణాలపై కొరడా ఝళిపిస్తున్నామని, 40 వరకు చిన్న, పెద్ద అక్రమ కట్టడాలను కూల్చేశామని తెలిపారు. కొందరు నేరుగా వచ్చి ఫిర్యాదు చేస్తుండగా మరికొందరు ఫేస్బుక్, వాట్సాప్‌లో ఫి ర్యాదులు చేస్తున్నారని చెప్పారు. ఆ ఫిర్యాదులను విశ్లేషించి అధికారులతో మాట్లాడుతూ తగిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. హైడ్రాకు ఇంకా సిబ్బందిని నియమించలేదని, రెండు నెలల్లో ఆ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. కబ్జాల కారణంగా అనేక ప్రాంతాలలో వర్షపు నీరు నిలిచిపోతున్నదని, దీంతో ట్రాఫిక్ స్తంభిస్తున్నదని అన్నారు.