హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/సిటీబ్యూరో, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): కొన్నిరోజులుగా రాష్ట్రంలోనే సంచల నం రేకెత్తించిన నాదర్గుల్ భూముల వ్యవహారంలో అందరినీ విస్మయానికి గురి చేసే పరిణామమిది. సాక్షాత్తూ ప్రభుత్వం తరఫున రెవె న్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అవి ప్రభుత్వ భూములుగా ప్రకటించారు. తమ ప్రభుత్వమే వాటిని కాపాడుతుందనీ చెప్పారు. కానీ అందుకు భిన్నంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాత్రం ప్రస్తుతానికి ఆ భూ ములు ప్రైవేట్‌కు ఉన్నాయని, ఆ విషయాన్ని తనకు జిల్లా కలెక్టర్ చెప్పారని స్పష్టం చేయడం గమనార్హం. ప్రస్తుతం అందులో ఉన్న లచ్చమ్మకుంటపై దృష్టిసారించినట్టుగా అభిప్రాయపడ్డారు. అంటే 22-ఏ నిషేధిత జాబితాలో వస్తున్న 373.22 ఎకరాలపై హైడ్రా చేసేదేమీ లేదు.. లచ్చమ్మకుంటపై మాత్రం సర్వే చేస్తామని కుండబద్దలు కొట్టారు. మూడు రోజుల కిందట పలుచోట్ల హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటన సందర్భంగా ఓ జర్నలిస్టు నాదర్గుల్ భూముల అంశంపై ప్రశ్నించారు. నాదర్గుల్ భూముల వ్యవహారం హైడ్రా రంగనాథ్‌కు కనిపించడం లేదా? అని హరీశ్‌రావు అడుగుతున్నారని జర్నలిస్టు అనడంతో ‘ఆల్రెడీ దాని మీద మేం విచారణ మొదలుపెట్టాం. భూమికి సంబంధించి ఆల్రెడీ చెప్పారు. భూమికి సం బంధించి కలెక్టర్ అవి ప్రైవేట్‌కు ఉందని చెప్పా రు. ప్రైవేట్ వాళ్లు కూడా ప్రెస్‌మీట్ పెట్టి చెప్పా రు. దాని మీద విచారణ జరుగుతున్నది. ఇ తర్వాత కచ్చితంగా యాక్ట్ చేస్తాం. అందులో చెరువు ఉన్నదని చెప్తున్నారు. నోటిఫై అయిందని కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి ప్రైవేట్ వ్యక్తులు కూడా వచ్చి చెరువు ఎక్కడుం దో చెప్తే దానికి సంబంధించి మొత్తం వెంటనే దారి అంతా ఓపెన్ చేస్తామని చెప్పారు. దానికి మేం రెవెన్యూ, ఇరిగేషన్, హైడ్రా టీమ్‌లతో ఫీల్డ్ సర్వే పెట్టాం. వచ్చే వారం ఫీల్డ్ సర్వే చేస్తాం. అక్కడికి నేను స్వయంగా వెళ్లాల్సిన అవసరం లేదు. చెరువును జీఐఎస్ మ్యాప్‌లో చూస్తాం. అక్కడ నీళ్లు కూడా కొన్ని ఉన్నట్టుగా కనబడుతున్నది. చుట్టూ ఏమైనా ఫెన్సింగ్ ఉంటే తీసేస్తాం. ఏదేమైనా ప్రైవేట్ వ్యక్తులు కూడా అలాంటిదేమన్నా ఉంటే మేమే తీసేస్తామంటున్నరు’ అని సముదాయించుకున్నారు.
ప్రభుత్వ భూములు, ఆస్తులు, నీటి వనరులను పరిరక్షించేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా తీరు విచిత్రంగా తయారైంది. ఏడాదిన్నరకు పైగా చేపట్టిన కూల్చివేతలకే కాదు.. వదిలిపెట్టిన వాటికి సైతం ఏదో ఒక కారణం చెప్పడం చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వ నిషేధిత జాబితా 22-ఏలో ఉన్న భూములతోపాటు కోర్టు వివాదాల్లో ఉన్న వాటిపైనా హైడ్రా ఒక్కోచోట ఒక్కోలా వ్యవహరించడం అందరినీ విస్మయానికి గురి చేస్తున్నది. ఇటీవల రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామంలోని సర్వేనంబర్ 55లోని 8 ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ భూమిని హైడ్రా ఈ నెల 7న స్వాధీనం చేసుకున్నది. బడా రియల్ ఎస్టేట్ సంస్థల స్వాధీనంలో ఉన్న 4.20 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు కొలను మాధవరెడ్డి కూతురు సబితకు చెందిన 4 ఎకరాల భూమి ని కూడా హైడ్రా స్వాధీనం చేసుకున్నది.
ఇందులో తాత్కాలింకగా వేసిన షెడ్లను తొలగించింది. విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ప్రభుత్వ నిషేధిత జాబితా 22-ఏలో ఉన్న భూములు అయినందున వీటిని స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నది. ఇదేకాదు.. ఇదే సర్వేనంబర్‌లోని మరికొంత భూమిని కూడా ఇదే కారణంతో ఫిబ్రవరిలో స్వాధీనం చేసుకొని కంచె వేసింది. ఎలాగూ ప్రభుత్వ రికార్డుల్లో సర్కార్ భూమిగా ఉన్నందున స్వాధీనం చేసుకోవడం సమంజసమే. కానీ ఇదే జిల్లాలోని నాదర్గుల్ సర్వేనంబర్‌లోని 613లో ఉన్న 373.22 ఎకరాలకు ఈ సూత్రం ఎందుకు వ ర్తించదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ భూ ములను కూడా రంగారెడ్డి కలెక్టర్ 22-ఏ నిషేధిత జాబితాలో ప్రభుత్వ భూమిగా పొందుపరిచారు. ఇక్కడ కోర్టు నుంచి సదరు ప్రైవేట్ కంపెనీలకు ఉత్తర్వులు ఉన్నాయనే కారణాన్ని చూపుతున్నట్టు తెలిసింది.
మరి ఖానామెట్‌లో ని భూముల్లో కూడా 2016 నుంచి హైకోర్టు ఇంజంక్షన్ ఉత్తర్వులున్నాయి. హైడ్రా అడిగిన వివరాలను శేరిలింగంపల్లి తహసీల్దార్ వెంకారెడ్డి నిరుడు డిసెంబర్లో హైడ్రా కమిషనర్‌కు రాసిన లేఖలోనూ కోర్టు ఇంజంక్షన్ ఉత్తర్వుల అంశాన్ని పొందుపరిచారు. కానీ అందులో హైడ్రా పార్టీగా (రెస్పాండెంట్) లేదు కదా! అంటూ ఆ భూములను స్వాధీనం చేసుకున్నారు. అదేరీతిన నాదర్గుల్ భూముల అంశంలోనూ హైడ్రా పార్టీగా లేదు. పైగా నాదర్గుల్ భూముల న్యాయ వివాదాల్లో 2015లో సుప్రీంకోర్టు ఆ భూములు శివరాజ్ బహదూర్ ఇలాకా భూములుగా స్పష్టం చేసింది. కానీ తదుపరి చోటుచేసుకున్న పరిణామాల్లో భాగంగా 2022లో హైకోర్టు డివిజన్ బెంచ్ సదరు ప్రైవేట్ వ్యక్తులకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. ఆ భూములు 22-ఏ నిషేధిత జాబితాలో ఉంచడాన్ని సమర్థించింది.
ఆపై సుప్రీం కోర్టులో న్యాయ వివాదం కొనసాగుతూనే ఉన్నది. కానీ ఎక్కడా స్టే ఉత్తర్వులు లేవు. రంగారెడ్డి జిల్లా కోర్టు ఇచ్చిందని చెప్తున్న ఇంజంక్షన్ ఉత్తర్వులు కూడా నాదర్గుల్ రైతులు పార్టీగా ఉన్న కేసుకు సంబంధించినవే. అంటే ప్రస్తుతం హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులే అమల్లో ఉన్నాయని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వీటన్నింటికీ మించి ఇప్పటికిప్పుడు నిషేధిత జాబితాలో ఆ భూములు ఉండటంతో పాటు సాక్షాత్తూ రెవెన్యూ శాఖ మంత్రి అవి ప్రభుత్వ భూములే అని ప్రకటించిన తర్వాత కూడా హైడ్రా కమిషనర్ అవి ప్రైవేట్‌కే ఉన్నాయని వ్యాఖ్యానించడం, కలెక్టర్ తనకు అలా చెప్పారనడం చర్చనీయాంశంగా మారింది.
ఇది రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలంలోని నాదర్గుల్ సర్వేనంబర్ 613లోని భూమి. 12 రోజులుగా రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న బాగోతానికి సంబంధించిన భూములివి. సాక్షాత్తూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సైతం రెండు రోజుల కిందట సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి 373.22 ఎకరాలు ప్రభుత్వ భూములే అని ప్రకటించారు. ఆ భూములను గత బీఆర్ఎస్ ప్రభుత్వం గాలికి వదిలేస్తే ఇప్పుడు తామే రక్షిస్తున్నామనీ సెలవిచ్చారు. కానీ అందుకు భిన్నంగా క్షేత్రస్థాయిలో తాజాగా ఓ బలమైన ఆధారం వెలుగులోకి వచ్చింది.
బీఆర్ఎస్ హయాంలో ఆ భూములను ప్రభుత్వానివిగా గుర్తిస్తూ ఏర్పాటు చేసిన హద్దు రాయి ఒకటి ‘నమస్తే తెలంగాణ’ కంటపడింది. ఆ హద్దు రాయిపై స్పష్టంగా ఆంగ్ల అక్షరాల్లో ప్రభుత్వ భూమి అని ఉన్నది. దాన్ని ఆనుకునే మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు గతంలో అదనపు డైరెక్టర్‌గా ఉన్న ఏక్యూ స్వేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రేకులతో కంచె ఏర్పాటు చేసింది. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న నాదర్గుల్ రైతులను అందులోకి రానివ్వకుండా దౌర్జన్యం చేస్తున్నది.
ఈ క్రమంలో రైతులు కొన్నిరోజులుగా అక్కడే వంటావార్పు చేసుకుంటూ తమ భూముల కోసం పోరాటం సాగిస్తున్నారు. అయినా అధికారులు, పోలీసుల అండదండలతో ప్రైవేట్ కంపెనీలు దర్జాగా రేకుల కంచె నిర్మించారు. ఎవరేం చేస్తారులే! అన్న ధీమాతో ప్రభుత్వ హద్దు రాయిని సైతం అట్లనే ఉంచారంటే ప్రభుత్వ వ్యవస్థలంటే ఎంత లెక్కలేనితనం ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.