బంజారాహిల్స్, జనవరి 22: బంజారాహిల్స్ రోడ్ నం. 2లోని షాంగ్రిల్లా ప్లాజా వెనకాల ఉండే సుభాష్ కుమార్ లహోడీ లే అవుట్లో సుమారు ఎకరం విస్తీర్ణంలో జీహెచ్ఎంసీ ట్రీ పార్కు ఉంది. ఈ పార్కును ఆనుకొని పారిశ్రామికవేత్త శ్రీధర్‌రావు భవన నిర్మాణం చేపట్టారు. ఏడాది నుంచి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కాగా, భవనానికి దక్షిణం వైపున సుమారు మూడు ఎకరాల ఖాళీ ప్రభుత్వ స్థలం ఉంది. ఏడాది కిందట పక్కనున్న ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి షెడ్ల నిర్మాణం, శాశ్వత నిర్మాణాలు చేపట్టడంతో ఫిర్యాదులు అందుకున్న షేక్‌పేట రెవెన్యూ అధికారులు కూల్చివేతలు చేపట్టారు.
రెండు తెలుగు రాష్ర్టాల్లో సీఎంలతో సహా పెద్దలంతా తనకు స్నేహితులంటూ అధికారులను దబాయించిన శ్రీధర్‌రావుపై ప్రభుత్వ స్థలం ఆక్రమించారంటూ తహసీల్దార్ అనితారెడ్డి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. శ్రీధర్‌రావు 300 గజాల స్థలంలో మట్టిని నింపి చదును చేస్తున్నారు. ఇంటికి ఉత్తరం వైపున ఉన్న జీహెచ్ఎంసీ పార్కుకు చెందిన ప్రహరీని కూల్చివేసి నిర్మాణ సామగ్రిని, సిమెంట్ బస్తాలను పార్కులో వేశారు.
స్థానికులకు ఆహ్లాదాన్ని పంచాల్సిన పార్కు మొత్తం నిర్మాణ సామగ్రితో కళావిహీనంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ పార్కు ప్రహరీని కూల్చడమే కాకుండా స్థలాన్ని సొంతంగా వాడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. రూ. 10 కోట్ల విలువైన స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నాల్లో భాగంగానే మట్టిని నింపుతున్నారని, వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డి మాండ్ చేస్తున్నారు.