శంషాబాద్ రూరల్: రేడియల్ రోడ్డు(ఆర్ఆర్) నిర్మాణానికి భూములను సర్వే చేయడానికి వచ్చిన రెవెన్యూ అధికారులను మల్కారం సర్పంచ్ భిక్షపతిరెడ్డి ఆధ్వర్యంలో రైతులు, స్థానికులు అడ్డుకోవడంతో వెనుదిరిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శంషాబాద్ నుంచి షాబాద్ వరకు ఉన్న పాత రోడ్డు కాకుండా సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్ వరకు శంషాబాద్ నుంచి రేడియల్ రోడ్డు వేయడానికి పేదల, రైతుల భూములను అక్రమంగా లాక్కోవడం అన్యాయమని ఆరోపించారు.
గురువారం శంషాబాద్ మండలం మల్కారంలో రేడియల్ రోడ్డు ఏర్పాటు కోసం ఆర్ఐ మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో సర్వే చేయడానికి వస్తే రైతులు, స్థానికులు అడ్డుకున్నారు. అధికారులు ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి కానీ ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు చేయడం ఏమిటని వారు నిలదీశారు. సాయంత్రం సర్వే చేయడానికి వచ్చిన అధికారులను అడ్డుకున్నారు.