హైదరాబాద్ సిటీబ్యూరో, మే 24 (నమస్తే తెలంగాణ): ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో హైదరాబాద్ మహానగరం బెంగళూరును అధిగమించింది. భారతీయ సిలికాన్ వ్యాలీగా, ఐటీ రంగానికి కేంద్ర బిందువుగా బెంగళూరున్న విషయం తెలిసిందే. అలాంటి నగరాన్ని వెనుకకు నెట్టి భాగ్యనగరం మొదటి స్థానంలో నిలిచింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అనరాక్ రిసెర్చ్ తమ ‘ఇండియన్ ఆఫీస్ మార్కెట్ అప్డేట్ 2021-22’ నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది.
అంతకుముందు ఆర్థిక సంవత్సరాలతో పోల్చితే గత ఆర్థిక సంవత్సరంలో వివిధ కంపెనీలు లీజుకు తీసుకున్న దానిలో 23 శాతం హైదరాబాద్‌లో ఉండగా, బెంగళూరు 22 శాతంతో రెండో స్థానంలో ఉన్నది. ఇక ఢిల్లీ, పుణే వంటి నగరాల్లో 15 శాతంగానే ఉన్నట్టు అనరాక్ తెలిపింది. గతంతో పోల్చుకుంటే ఈసారి ఆఫీస్ స్పేస్ వినియోగంలో హైదరాబాద్ చాలా ప్రాముఖ్యతనే కలిగి ఉన్నది. దేశంలోని 7 ప్రధాన నగరాల్లో భాగ్యనగరం అగ్ర స్థానంలో నిలవడం అందరి దృష్టిని ఆకర్షించింది.
ఆఫీస్ స్పేస్ మార్కెట్లోకి హైదరాబాద్ నుంచి కొత్తగా 11.8 మిలియన్ చదరపు అడుగులు అందుబాటులోకి వచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో 7.85 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో నికర లీజులు జరిగాయి. సగటున అద్దె చదరపు అడుగుకు రూ.58గా ఉన్నది. ఇది దేశంలోని 7 ప్రధాన నగరాల్లో రెండో చౌక ధర. కాగా, హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ వినియోగంలో ఐటీ, ఐటీ అనుబంధ కంపెనీలు 52 శాతంతో ముందున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో కో-వర్కింగ్ (20 శాతం), బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (19 శాతం) సంస్థలున్నాయి.
అనరాక్ నివేదిక ప్రకారం గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో దేశంలోని 7 ప్రధాన నగరాల్లో మొత్తం 3.41 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను కంపెనీలు లీజుకు తీసుకున్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2020-21)తో చూస్తే ఇది 60 శాతం పెరిగింది. దేశంలోని మూడు ప్రధాన నగరాలైన బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలు కలిపి మొత్తం డిమాండ్‌లో 54 శాతం వాటాతో ఉండటం గమనార్హం.
మరో ప్రముఖ రియల్ ఎస్టేట్ మార్కెట్ అధ్యయన సంస్థ జేఎల్ఎల్ ఇటీవలి నివేదికలోనూ హైదరాబాద్.. దేశంలోని 7 ప్రధాన నగరాల్లో అగ్ర స్థానంలో నిలిచింది. సమీక్ష కాలంలో హైదరాబాద్‌లో 3.42 మిలియన్ చదరపు అడుగుల్లో ఆఫీస్ స్పేస్ లీజుకుపోయింది. పుణేలో 2.30, బెంగళూరులో 1.67, ముంబైలో 1.44, చెన్నైలో 1.21, ఢిల్లీలో 1.34, కోల్‌కతాలో 0.18 మిలియన్ చదరపు అడుగుల చొప్పున ఆఫీస్ స్పేస్‌ను ఆయా రంగాల్లోని కంపెనీలు అద్దెకు తీసుకున్నట్టు తేలింది. వీటిలో టెక్నాలజీ రంగానికి చెందిన కంపెనీలే ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో మాన్యుఫ్యాక్చరింగ్, ఇండస్ట్రియల్, కో-వర్కింగ్ స్పేస్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, కన్సల్టెన్సీ బిజినెస్, ఈ-కామర్స్ వంటి రంగాల సంస్థలున్నాయి.