హైదరాబాద్ : హైదరాబాద్ మహా నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల వరకు తీవ్రమైన ఎండలు దంచి కొట్టగా.. ఆ తర్వాత ఉన్నట్టుండి వాతావరణం చేంజ్ అయ్యింది. ప్రస్తుతం ఆకాశం మేఘావృతమై ఉంది. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్, కామారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
నగరంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన వర్షాలు కురవొచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో ద్రోణి, క్యూములోనింబస్ మేఘాల ప్రభావం నెలకొందని వాతావరణశాఖ వెల్లడించింది. శుక్రవారం నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అదేవిధంగా రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఒకటి నుంచి రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నది.