న్యూఢిల్లీ: వరుస విజయాలతో జోరు మీదున్న హైదరాబాద్ జట్టు.. దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. లీగ్ దశలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ అజేయంగా నిలిచిన హైదరాబాద్.. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో 30 పరుగుల తేడాతో గుజరాత్‌ను చిత్తు చేసింది. టాపార్డర్ బ్యాటర్ తిలక్ వర్మ (50 బంతుల్లో 75; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) విజృంభించడంతో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (31), రాహుల్ (25 నాటౌట్), హిమాలయ్ అగర్వాల్ (23) ఫర్వాలేదనిపించారు. గుజరాత్ బౌలర్లలో పియూష్ చావ్లా, చింతన్ గాజా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 128 పరుగులకే పరిమితమైంది. రిపాల్ పటేల్ (35) టాప్ స్కోరర్. హైదరాబాద్ బౌలర్లలో రవితేజ 3, సీవీ మిలింద్ రెండు వికెట్లు పడగొట్టారు. ఇతర క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో బెంగాల్‌పై సూపర్ ఓవర్లో కర్ణాటక విజయం సాధించగా.. కేరళపై తమిళనాడు, రాజస్థాన్‌పై విదర్భ గెలుపొందాయి. శనివారం జరుగనున్న తొలి సెమీఫైనల్లో తమిళనాడుతో హైదరాబాద్ తలపడనుంది.
హైదరాబాద్: 20 ఓవర్లలో 158/5 (తిలక్ వర్మ 75, తన్మయ్ అగర్వాల్ 31; పియూష్ చావ్లా 2/9), గుజరాత్: 20 ఓవర్లలో 128/8 (రిపాల్ పటేల్ 35; రవితేజ 3/27, మిలింద్ 2/28).
సూపర్ థ్రిల్లర్
టీమ్ఇండియా ఆటగాడు మనీశ్ పాండే అదరగొట్టడంతో కర్ణాటక జట్టు ముస్తాక్ అలీ టోర్నీ సెమీస్‌లో అడుగుపెట్టింది. గురువారం బెంగాల్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో కర్ణాటక సూపర్ ఓవర్లో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కర్ణాటక 20 ఓవర్లలో 5 వికెట్లకు 160 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ (29 బంతుల్లో 55 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడగా.. రోహన్ (30), కెప్టెన్ మనీశ్ పాండే (29) రాణించారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన బెంగాల్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి సరిగ్గా 160 పరుగులే చేసింది. చివరి ఓవర్లో బెంగాల్ విజయానికి 20 పరుగులు అవసరం కాగా.. రాయ్ చౌదరి ఆకాశ్‌దీప్ వరుసగా 6,6,1,4,2 పరుగులు రాబట్టారు. చివరి బంతికి సింగిల్ తీస్తే బెంగాల్ ముందడుగు వేస్తుందనగా.. కర్ణాటక కెప్టెన్ మనీశ్ పాండే అద్భుత త్రోతో ఆకాశ్ దీప్‌ను రనౌట్ చేశాడు. ఫలితంగా ఇరు జట్ల స్కోర్లు సమమవడంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగాల్ 5 పరుగులే చేసి రెండు వికెట్లు కోల్పోగా.. ఛేదనలో మనీశ్ పాండే తొలి రెండు బంతులకు 2,6 కొట్టి మ్యాచ్‌ను ముగించాడు.