–సంతోషం వ్యక్తం చేస్తున్న వాహనదారులు, పాదచారులు
-ఫిలింనగర్-కొత్త చెరువు రోడ్డుపై వెల్లి విరిసిన పచ్చదనం
-సెంట్రల్ మీడియన్‌లో మొక్కలతో కొత్త శోభ
బంజారాహిల్స్,డిసెంబర్ 1: రోడ్డుకు రెండువైపులా ఫుట్‌పాత్‌లు.. రోడ్డు మధ్యలో సెంట్రల్ మీడియన్‌లో మొక్కలు.. మధ్యలో వాకర్ల సౌకర్యం కోసం మెట్లు.. ఫిలింనగర్ నుంచి కొత్త చెరువు రోడ్డు కొత్త శోభను సంతరించుకుంది. సైబరాబాద్ నుంచి జూబ్లీహిల్స్, ఫిలింనగర్, బంజారాహిల్స్ ప్రాంతాల మీదుగా నగరంలోని పలు ప్రాంతాలకు వెళ్లేందుకు సులువుగా మారిన ఫిలింనగర్-కొత్త చెరువు రోడ్డును మరింత శోభాయమానంగా మార్చేందుకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టిన సెంట్రల్ మీడియన్ పనులు పూర్తయ్యాయి. ఏడాది క్రితం రూ.1.40కోట్ల వ్యయంతో చేపట్టిన మీడియన్ నిర్మాణపనులు ఇటీవల పూర్తయ్యాయి.
సుమారు 500మీటర్ల మేర రోడ్డుకు మధ్యలో సెంట్రల్మీడియన్ ఏర్పాటు చేశారు. దీనికి మధ్యలో వాకర్లు నడిచేందుకు వాకింగ్ ట్రాక్‌తో పాటు మెట్లను ఏర్పాటు చేశారు. మెట్లకు ఇరువైపులా జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ విభాగం ఆధ్వర్యంలో పచ్చదనం పెంచేందుకు వందల సంఖ్యలో మొక్కలు నాటడంతో వాహనదారులను కనువిందు చేస్తోంది. రోడ్డుకు రెండువైపులా ఫుట్‌పాత్‌లను నిర్మించడంతో పాటు ఫుట్‌పాత్‌పై మొక్కలు పెట్టడంతో ఆహ్లాదం పంచుతున్నాయి. ఇంజినీరింగ్ విభాగం చేపట్టిన సివిల్ వర్క్స్ పూర్తికావడంతో జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ విభాగం రంగంలోకి దిగి వివిధ రకాల పూలమొక్కలు, లాన్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఆకర్షణీయమైన రీతిలో వీధి దీపాలు, శిల్పాలను ఏర్పాటు చేయడంతో పాటు ఆహ్లాదాన్ని పంచేలా సెంట్రల్మీడియన్ను తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని యూబీడీ అధికారి బాలయ్య తెలిపారు.