హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): రియల్ రంగంలో హైదరాబాద్ జోరు కొనసాగుతున్నది. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లోనూ రెసిడెన్షియల్ ఫ్లాట్ల విక్రయాలు భారీ ఎత్తున జరిగాయి. కేవలం జనవరి ఒక్క నెలలోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఏకంగా రూ.2,695 కోట్ల విలువగల నివాస గృహాల రిజిస్ట్రేషన్లు జరిగినట్టుగా నైట్‌ఫ్రాంక్ ఇండియా తాజా నివేదికలో తెలిపింది. ప్రధానంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో ఫ్లాట్ల అమ్మకాలు జరిగినట్టుగా నివేదికలో పేర్కొన్నారు. కాగా, ఈ అమ్మకాల్లో సింహభాగం రూ.50 లక్షల లోపు ఫ్లాట్ల విక్రయాలే ఉండటం గమనార్హం. మూడు పడకలు, అంతకుమించిన విస్తీర్ణం కలిగిన ఫ్లాట్ల విక్రయాలు పుంజుకున్నప్పటికీ… రూ.50 లక్షల వరకు ఫ్లాట్ల విక్రయాలు మాత్రం భారీ ఎత్తున నమోదైనట్టు నివేదిక స్పష్టం చేస్తుంది. మొత్తం అమ్మకాల్లో రూ.25 లక్షల వరకు ధర కలిగిన వాటి విక్రయాలు 32%గా ఉంటే 25-50 లక్షల వరకు ఉన్న వాటి విక్రయాలు అత్యధికంగా 39 శాతంగా ఉన్నాయి. అంటే రూ.50 లక్షల్లోపు ఫ్లాట్ల విక్రయాలే 71% వరకు ఉన్నాయి. ఈ ప్రకారం వెయ్యి నుంచి రెండు వేల చదరపు గజాల ఫ్లాట్ల విక్రయాలు ఏకంగా 72 శాతంగా నమోదయ్యాయి.
రంగారెడ్డిలోనే దాదాపు సగం…
జనవరి నెలలో జరిగిన ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లలో రంగారెడ్డి పరిధిలోనే దాదాపు సగం వరకు జరిగినట్టుగా నివేదికలో వెల్లడించారు.ఈ జిల్లా పరిధిలో గత ఏడాది కంటే 10% మేర విక్రయాలు పెరిగి, మొత్తం అమ్మకాల్లో 48 శాతంగా నమోదయ్యాయి. హైదరాబాద్ జిల్లా పరిధిలో గత ఏడాది కంటే తక్కువగా నమోదై… 14 శాతం అమ్మకాలు జరిగాయి. మేడ్చల్-మల్కాజిగిరి పరిధిలో గత ఏడాది కంటే రెండు శాతం మేర తగ్గి 35 శాతం మేర వ్యాపారం జరిగింది. ఇక… సంగారెడ్డి పరిధిలో గత ఏడాది లెక్కనే అమ్మకాలు మూడు శాతానికి పరిమితం అయ్యాయి. కొవిడ్ కారణంగా 2020లో ఫ్లాట్ల ధరలు స్తబ్దుగా ఉండగా… ఆతర్వాత 2021లో పెరుగుతూ… 2022 జనవరిలో మునుపటికంటే సరాసరి 7.8% పెరిగినట్టుగా నివేదిక తెలిపింది. ఇందులో హైదరాబాద్ పరిధిలో ధరల వృద్ధి 0.8 శాతంగా ఉంటే, రంగారెడ్డిలో 6.3 శాతం, సంగారెడ్డిలో ఆరు శాతంగా ఉంది. అత్యధికంగా మేడ్చల్-మల్కాజిగిరి పరిధిలో 8.7 శాతంగా ధరల పెరుగుదల నమోదైంది.
ధరలవారీగా ఫ్లాట్ల విక్రయాలు ఇలా
ధర (రూపాయల్లో) జనవరి
25 లక్షల వరకు 32 శాతం
25-50 లక్షల వరకు 39 శాతం
50-75 లక్షల వరకు 13 శాతం
75 లక్షలు-కోటి వరకు 8 శాతం
కోటి – రెండు కోట్ల వరకు 6 శాతం
రెండు కోట్లకు పైగా… 2 శాతం