హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 29 (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ నగరం దేశంలోనే స్వర్గధామం. ఐదారేండ్ల క్రితం వరకూ గ్లోబల్ మ్యాప్‌పై అగ్రస్థానంలో నిలిచిన సిటీ రియల్టీ ఇప్పుడు రెక్కలు విరిగిన పక్షిలా మారింది. రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ గల్లంతైంది. ప్రముఖ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ జేఎల్ఎల్ విడుదల చేసిన ఈ ఏడాది తొలి త్రైమాసిక నివేదిక భవన నిర్మాణాలు, వాటి క్రయవిక్రయాల్లో హైదరాబాద్ దుస్థితికి అద్దం పట్టింది. జేఎల్ఎల్ నివేదిక ప్రకారం దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో జరిగిన ఇండ్ల విక్రయాల్లో టాప్-4లో బెంగళూరు, ముంబై, ఫుణె, ఢిల్లీ నగరాలు ఉండగా.. ఆ తర్వాత స్థానాల్లో ఇండోర్, లక్నో, కోయంబత్తూర్ ఉన్నాయి. చివరకు ఏపీ కొత్త రాజధాని అమరావతితో కూడా పోటీలో ఉంది. కానీ ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాంటి హైదరాబాద్ నగర రియల్టీ తొలిసారిగా జాబితాలో లేకుండా పోయింది. ఒకప్పుడు ఇండ్ల అమ్మకాల్లో రికార్డులు సృష్టించిన హైదరాబాద్… ఇప్పుడు కనీసం రేసులో కూడా లేకుండాపోయింది. జాతీయ స్థాయిలో వినిపిస్తున్న రియల్ ఎస్టేట్ బూమ్‌లో హైదరాబాద్ పేరు ఎక్కడా కనీసం ప్రస్తావనకు రాకపోవడం కాంగ్రెస్ పాలన ఘోర వైఫల్యానికి నిదర్శనంగా ఈ నివేదిక నిలిచింది.
కాంగ్రెస్ సర్కార్ ఆర్భాటంగా తీసుకొచ్చిన హైడ్రా.. సిటీ రియల్ ఎస్టేట్ రంగానికి మరణశాసనంగా మారింది. చెరువులు, కుంటలు, పరిరక్షణ పేరిట సృష్టించిన విధ్వంసం కొనుగోలుదారుల్లో తీవ్ర భయాందోళన కలిగించింది. ఎంతోమంది నిరుపేదల ఇండ్లను కూల్చిన హడ్రా.. ఆ క్రమంలో సిటీ రియల్టీని కూడా నేలమట్టం చేసిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అనుమతులున్న ప్రాజెక్టులను సైతం అర్ధరాత్రి నోటీసులిచ్చి… ఎఫ్టీఎల్, బఫర్జోన్ల పేరిట ధ్వంసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరానికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న విశ్వసనీయతను దెబ్బతీసింది. కొనుగోలు చేసిన ఆస్తులకు భద్రత లేకుండా చేసిన ప్రభుత్వం.. స్థానికులతోపాటు విదేశీ పెట్టుబడిదారులను సైతం ఇటువైపు కన్నెత్తి చూడకుండా చేసిందని జేఎల్ఎల్ నివేదికతో స్పష్టమవుతున్నది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపాన్ని సరిదిద్దలేని సర్కార్.. అనుమతులు ఉన్న నిర్మాణాలపైకి కూడా హైడ్రా కత్తిని వేలాడదీసి.. హైదరాబాద్‌లో స్థిరాస్తి కొనుగోలు చేయడం కంటే పక్కరాష్ర్టాల్లో పెట్టుబడి మేలు అనే స్థితికి దిగజార్చింది.

జేఎల్ఎల్ విడుదల చేసిన జాతీయ స్థాయి నివేదిక పరిధి కేవలం అమ్మకాలకే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా కొత్త ప్రాజెక్టుల లాంచింగ్, ధరలు, రీసేల్ అంశాలను కూడా ప్రస్తావించింది. వీటిలో ఏ ఒక్క రంగంలోనూ హైదరాబాద్‌కు స్థానం దక్కలేదు. తొలి త్రైమాసికంలో రికార్డు స్థాయిలో 90వేల కొత్త గృహాల ప్రాజెక్టులు ప్రారంభమై.. గత ఏడాదితో పోలిస్తే 13శాతం వృద్ధి నమోదు కాగా, బెంగళూరు, ఢిల్లీ-ఎన్సీఆర్ నగరాలు దూకుడు ప్రదర్శించాయి. హైదరాబాద్ స్థిరాస్తి రంగం మాత్రం కొత్త ప్రాజెక్టుల ప్రారంభంలో పూర్తిగా స్తంభించింది. భాగ్యనగరంలో ఇండ్ల ధరలు ఎనిమిది శాతం మేర పెరిగినప్పటికీ, అది కొనుగోలుదారులను ఆకట్టుకోలేకపోయింది. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వంటి నగరాల్లో ధరల పెరుగుదల 12-20 శాతం పైగా ఉన్నా.. అమ్మకాలు జోరుగా సాగాయి. ఇలా మిగతా నగరాలన్నీ దూసుకుపోతుంటే.. హైదరాబాద్‌లో మాత్రం పాలనా వైఫల్యంతో ఏర్పడిన గందరగోళ పరిస్థితులు వినియోగదారులను రియల్ ఎస్టేట్ రంగానికి దూరం చేస్తున్నాయి. రూ. కోటి దాటిన ప్రీమియం ఇండ్ల విక్రయాలు దేశవ్యాప్తంగా 45-65 శాతం వృద్ధిని సాధిస్తుంటే.. నగరంలో మాత్రం కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లు వెనకడుగు వేసే పరిస్థితి వచ్చిందంటే ప్రభుత్వ వైఫల్య వల్ల జరిగిన వినాశనం పరాకాష్టకు చేరిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక సిటీ రియల్టీకి హార్ట్ ఆఫ్ ద బిజినెస్ జోన్‌గా చెప్పుకొనే వెస్ట్ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్ ప్రాంతాల్లో ప్రీమియం ప్రాజెక్టుల లాంచింగ్ 70 శాతం మేర పడిపోయినట్టు తెలిసింది.
రియల్ ఎస్టేట్ మందగమనం కేవలం బిల్డర్లకు మాత్రమే పరిమితం కాలేదు. దీనిపై ఆధారపడిన 50కి పైగా అనుబంధ రంగాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. సిమెంట్, స్టీల్, పెయింటింగ్, ప్లంబింగ్, ఇంటీరియర్ రంగాల్లో పనిచేసే లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేక సొంతూళ్లకు తిరుగుముఖం పడుతున్నారు.
హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, రేరా వంటి అనుమతులు, ఆమోదం ఉన్న ప్రాజెక్టులను కూడా సామాన్యులు కొనుగోలు చేయలేని స్థాయిలో అభద్రతాభావం నెలకొని ఉంది. కేసీఆర్ హయాంలో గ్లోబల్ రేసులో నిలిచిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ రెండేండ్లలో దిగజారిపోయింది. విక్రయాలు తగ్గి, కొత్త ప్రాజెక్టుల నిర్మాణం నిలిచి, వచ్చే మూడేండ్లకు సరిపోయేంత ఇన్వెంటరీ నిలిచిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం టైర్-2 నగరాలైన ఇండోర్, జైపూర్, లక్నో, కోయంబత్తూర్ వంటి నగరాల్లో కూడా విపరీతమైన వృద్ధి రేటు నమోదవుతుంటే.. సిటీలో మాత్రం ఇన్వెస్ట్మెంట్లు లేక దివాలా పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయలాంటి రియల్ ఎస్టేట్ అథఃపాతాళానికి చేరి, జాతీయ స్థాయిలో ఊసే లేకుండా పోయిందని రియల్టర్లు, కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత పదేండ్లలో కేసీఆర్ తెచ్చిన స్థిరత్వంతో హైదరాబాద్‌లో పెట్టుబడులు వచ్చాయి. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనిశ్చితి కారణంగా ఇక్కడ పెట్టాల్సిన పెట్టుబడులు పక్క రాష్ర్టాల వైపు మళ్లిపోతున్నాయి. ఇక్కడ మార్కెట్ విలువను పెంచి స్థిరాస్తి విలువను పెంచినట్టు చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం… ఉన్న ఆస్తులకు రక్షణ లేకుండా చేసింది. అందుకే ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్లు కూడా సిటీ పెట్టుబడులు అంటే పెద్దగా ఆసక్తి చూపడం లేదు
-మహేందర్, సీనియర్ మార్కెటింగ్ మేనేజర్
ప్రాజెక్టులు స్తంభించడంతో బిల్డర్లు రుణ వాయిదాలు చెల్లించడం కష్టంగా మారింది. మరోవైపు ఇండ్ల కొనుగోలుదారులు కూడా రుణాలకు వెనుకాడుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే, బ్యాంకింగ్ రంగానికి కూడా తీవ్ర ప్రమాదం వాటిల్లుతుంది.
-విశాల్‌కుమార్, సీనియర్ ఫైనాన్షియల్ అనలిస్ట్
గతంలో హైదరాబాద్‌లో ఇల్లు కొనడం ఒక కల. సురక్షితమైన పెట్టుబడి. కానీ ఇప్పుడు హెచ్ఎండీఏ, రేరా అనుమతులు ఉన్నా.. ప్రాజెక్టుల్లో ఇల్లు కొనాలన్నా భయపడాల్సి వస్తున్నది. అందుకే చాలామంది ఐటీ ఉద్యోగులు ఇప్పుడు బెంగళూరు, పుణె నగరాల వైపు మొగ్గుచూపుతున్నారు.
– శ్రీకాంత్ రెడ్డి, ఐటీ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్
ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం, విధాన నిర్ణయాల్లో నిలకడ లేకపోవడంతో నిర్మాణాలు స్తంభించిపోయాయి. బ్యాంకు రుణాలు రాక, కొనుగోలుదారులు లేక బిల్డర్లు వడ్డీల భారంతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యవస్థను నిర్వీర్యం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలతో నగరంలో పరిశ్రమ నామరూపాల్లేకుండా పోతున్నది.
-నారగోని ప్రవీణ్‌కుమార్, తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్