
హైదరాబాద్, నవంబర్ 13: ఆసియా-పసిఫిక్ దేశాల్లో అత్యంత వేగంగా వృద్ధిచెందుతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్లలో హైదరాబాద్ కూడా ఉన్నది. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ భాగ్యనగరం రియల్టీ పరుగులు పెడుతున్నదని కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో గ్లోబల్ లీడరైన కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ (సీఅండ్‌డబ్ల్యూ) తెలిపింది. అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థలు అమెరికా తర్వాత భారత్‌లోనే అధికంగా, అదికూడా హైదరాబాద్‌నే తమ భారీ క్యాంపస్‌లకు ఎంచుకుంటుండటం కలిసొస్తున్నదని సీఅండ్‌డబ్ల్యూ హైదరాబాద్, ఈస్ట్ ఇండి యా ఎండీ వీరబాబు అన్నారు. ఈ క్రమంలోనే కార్యాలయ స్థలాలకు పెద్ద ఎత్తున డిమాండ్ కనిపిస్తున్నదని, ఈ జనవరి-సెప్టెంబర్‌లో నగర ఆఫీస్ ఇన్వెంటరీ 11 శాతం పెరిగిందని చెప్పారు. దేశంలోని ఇతర అన్ని నగరాలతో పోల్చితే ఇదే అత్యధికమని పేర్కొన్నారు. ‘గడిచిన నాలుగేండ్లలో ఈ సెగ్మెంట్ రెట్టింపైంది. 2025కల్లా మరో 50 శాతం వృద్ధిని అందుకోవచ్చు. సెప్టెంబర్ నాటికి దాదాపు 60 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజుకు తీసుకున్నారు. మొత్తం ఈ ఏడాదిలో డిమాండ్ సుమారు 75-80 లక్షల చదరపు అడుగులకు చేరే అవకాశాలున్నాయి’ అని ఆంగ్ల దినపత్రిక ‘తెలంగాణ టుడే’తో వీరబాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతోనే కరోనా ప్రభావం నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇంత త్వరగా కోలుకోగలిగిందన్నారు. ఈ ఏడాది క్వాల్కామ్ వంటి దిగ్గజ సంస్థలు దాదాపు 20 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను ఇక్కడ లీజుకు తీసుకోవడం ఇందుకు అద్దం పడుతున్నదన్నారు. కో-వర్కింగ్ స్పేస్‌కూ డిమాండ్ పెరుగుతున్నదని వివరించారు.