జాతీయ, అంతర్జాతీయ విమానాల్లో ఉన్న సాంకేతికత, వసతులు, పరీక్షలు గురించి తెలుసుకోవాలనుందా..? విమానాలు కొనుగోలు, వైమానిక రంగంలోకి అడుగుపెట్టాలనుందా ? కాక్‌పిట్ నుంచి సీటింగ్ వరకు.. డిజైన్ల నుంచి డెస్టినేషన్ల వరకు ఏవియేషన్ బిజినెస్ గురించి తెలుసుకోవాలనుకుంటే.. ‘వింగ్స్ ఇండియా-2022’కు వెళ్లాల్సిందే. కొనుగోలుదారులు, విక్రయదారులు, ఇన్వెస్టర్లు, స్టేక్ హోల్డర్స్‌ను ఒకే చోటుకు చేర్చి ఏవియేషన్ ఇండస్ట్రీపై కూలంకషంగా చర్చించడానికి అవకాశమిచ్చే వేదిక ఇది. బేగంపేటలో గురువారం భారత ప్రభుత్వ విమానయాన, ఫిక్కీ(ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండియన్ ఇండస్ట్రీ) ఆధ్వర్యంలో అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన అట్టహాసంగా ప్రారంభమైంది. మొదటిరోజు వైమానిక అంశాలపై పలు కంపెనీలకు చెందిన నిపుణులతో వ్యాపార చర్చలు సాగాయి. ఎయిర్‌క్రాఫ్ట్స్ తయారీ, బిజినెస్, కొనుగోళ్ల అంశాలపై సమూలంగా చర్చించారు. మొత్తంగా ఈ వైమానిక ప్రదర్శన ఔత్సాహికులకు కన్నుల పండువగా నిలిచింది.
2030 వరకు గ్లోబల్డ్రోన్ హబ్‌గా ఇండియా..
‘మేకింగ్ ఇండియా ఏ గ్లోబల్ డ్రోన్ హబ్-2030’ పేరుతో మొదటి రోజు ప్యానెల్ డిస్కషన్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జాయింట్ సెక్రటరీ అంబెర్ దుబే హాజరుకాగా, ప్యానలిస్టులుగా ఇడియా ఫార్గె సీఈవో అంకిత్ మెహత, డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ స్మిత్ షా, లోటెక్ వరల్స్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ దీపక్ భరద్వాజ్, ఆరవ్ అన్ మ్యాన్డ్ సిస్టమ్ లిమిటెడ్ సీఈవో విపుల్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబెర్ దుబే మాట్లాడుతూ.. కొవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో నిత్యావసరాల నుంచి మెడిసిన్ వరకు సుదూర ప్రాంతాలకు సరఫరా చేయడంలో డ్రోన్స్ పాత్ర అమోఘమని అన్నారు. 2030 వరకు గ్లోబల్ డ్రోన్ హబ్‌గా ఇండియా అవతరిస్తుందని చెప్పారు. అనంతరం అంకిత్ మెహత మాట్లాడుతూ డ్రోన్స్ తయారీలో ఇన్నోవేటివ్ టెక్నాలజీ వాడకం పెరగాలని సూచించారు. డ్రోన్ మార్కెట్, సేవలు అభివృద్ధిపై వక్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అనంతరం బీజినెస్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఎండీ కెప్టెన్ రాజేశ్ కె. బలి మాట్లాడుతూ.. ట్రావెల్ రంగంలో భద్రత, రక్షణ, సమర్థవంతమైన సేవలు కల్పించడం ముఖ్యమని చెప్పారు. అనంతరం ఎయిర్‌బస్ ఏసీజే బిజినెస్ డెవలప్మెంట్ జీన్ నోయెల్ రోబెర్ట్ మాట్లాడుతూ.. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో ఫ్లైట్స్, హెలీకాప్టర్లు వెళ్లగలిగేలా అత్యాధునిక సాంకేతికత వినియోగం పెరగాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మినిస్ట్రీ కార్పొరేట్ ఎఫయిర్స్ జాయింట్ సెక్రటరీ కేవీఆర్ మూర్తి, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జాయింట్ సెక్రటరీ ఉషా పదీ పాల్గొన్నారు.
ఇదొక గొప్ప అవకాశం
ఏవియేషన్ షోతో అనేక మంది వ్యాపారులు, వైమానిక విడిభాగాల ఉత్పత్తిదారులు అంతా ఒకే వేదికపైకి రావడం గొప్ప విషయం. తమ అభిప్రాయలను పంచుకోవడానికి ఇదొక గొప్ప అవకాశం. హైదరాబాద్‌లో ఏవియేషన్ షో ఎప్పుడు నిర్వహించినా సక్సెస్ అవుతుంది. వైమానిక రంగంలో అనేక కీలక మార్పులు వస్తున్నాయి. పట్టణాలు, గ్రామాలను అనుసంధానం చేసే వైమానిక రూట్ మ్యాప్ సిద్ధం కాబోతుంది. ఈ షోలో అనేక విమానాలు చూడటం చాలా సంతోషంగా ఉంది.
ఎయిర్‌బస్ ప్రత్యేకత
ఏ-350 ఎయిర్‌బస్ ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్రెంచ్ కంపెనీకి చెందింది. ఇది ఎలాంటి ఉష్ణోగ్రతల్లోనైనా ప్రయాణించగల సామర్థ్యం గలది. దీని వేగం గంటకు 800కిలో మీటర్లు. 400లకు పైగా ఇందులో సీట్లు ఉంటాయి. దీన్ని ఇంకా రాకపోకలకు ఉపయోగించడానికి సమయం పట్టనుంది. ఇప్పటి వరకు దీనికి నిర్వహించాల్సిన పరీక్షలు అన్నీ పూర్తయ్యాయి. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలను తట్టుకుంటుంది అందుకోసం అమెరికాలో ఉన్న వైమానిక కూలింగ్ చాంబర్లో 24 గంటలపాటు పెట్టి పరిశీలించారు. దుబాయిలోని అత్యధిక హీటర్ చాంబర్లో కూడా దీన్ని పరీక్షించారు. వీటన్నింటిని ఎదుర్కొని విజయవంతంగా నిలిచింది. చాలా విశాలంగా ఉంటుంది. మిగతా ఫ్లైట్స్తో పోల్చితే చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. ఇందలో త్రీ సీటింగ్ లైన్లతో ఉంటుంది.
విన్యాసాలు అదరహో..
సారంగ్ టీం మొదటి రోజు గగనతలంలో చేసిన వైమానిక విన్యాసాల ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది. కొమర్, అక్షయ్, వీర్, ధనవీర్, నికెట్, గోపిలు సభ్యులుగా మూడు హెలీకాప్టర్లను వరుసగా నడిపిస్తూ అదరహో అనిపించారు. గగనతలంలో పొగలు చిమ్ముకుంటూ వెళుతున్న విహంగాలను వీక్షకులంతా తమ సెల్ఫోన్లో బంధించడానికి పోటీపడ్డారు. హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ సాంకేతిక నైపుణ్యంతో సారంగ్ హెలీకాప్టర్ 2003లో బెంగళూరులో అడ్వాన్స్డ్ లైట్ హెలీకాప్టర్ ఎవెల్యూషన్ ఫ్లైట్ వారు రూపొందించారు. ఇది ఇండియన్ ఏవియేషన్ సెక్టార్‌కు మూలస్తంభంగా నిలబడింది. ఈ హెలీకాప్టర్ల బృందానికి సారంగ్ అని నామకరణం చేశారు. సారంగ్ అంటే సంస్కృతంలో నెమలి. 2004లో ఫిబ్రవరిలో సింగపూర్‌లో జరిగిన ఆసియా ఎయిర్‌స్పేస్ షోలో తొలి బహిరంగ ప్రదర్శన ఇచ్చింది. యునైటెడ్ ఎమిరెట్స్‌లో, బెర్లిన్‌లో ఏయిర్‌షోలో పాల్గొంది.
పలు అంశాలపై..
ఏవియేషన్ ఫైనాన్సింగ్ లీసింగ్ అంశంపై జరిగిన చర్చలో ఎన్ఐఐఎఫ్ ఈడీ ప్రకాశ్ రావు, స్టార్ ఎయిర్ సీఈవో సిమ్రాన్ సింగ్ తివానా, ఐఎఫ్ఎస్సీఏ ఈడీ దిపేష్ షావ, విమన్ ఏవియేషన్ సీఎఫ్‌వో రాజర్షి సేన్, ఏపీఏసీ ఎంబ్రెయిర్ వసూకి ప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం ఇండియా-యూకే అండ్ యూకేనాట్స్ సమావేశం జరిగింది. అనంతరం ఇన్వెస్ట్ ఇండియా ఆధ్వర్యంలో క్రిషి ఉడాన్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో క్రిషి ఉడాన్ స్కీం అమలు పై చర్చించారు. ఇన్నోవేటివిట్ టెక్నాలజీ, ఎయిర్‌క్రాఫ్ట్ మిషనరీ, బిజినెస్ ఏవియేషన్, ఎయిర్పోర్ట్ ఆపరేటర్స్, ఎయిర్పోర్ట్ ఏజెన్సీస్, ఫ్లైట్, సిమ్యూలేటర్ ట్రైయినింగ్, ఫ్లైట్ ఆపరేషన్స్, ట్రాన్స్‌పోర్టేషన్, మెయిన్టెనెన్స్ తదితర అంశాలపై వక్తలు చర్చించారు.
ఆకట్టుకున్న వైమానిక ప్రదర్శన
మొదటి రోజు విమానాల ప్రదర్శన ప్రత్యేక అతిథులను కనువిందు చేసింది. హిందూస్తాన్ ఏరోనాటికల్ హెలీకాప్టర్లు, ప్రాఫిట్ హంటర్, ఎయిర్‌బస్-ఈ2 ప్రత్యేక ఆకర్శణగా నిలిచాయి. చూపరులను ఆకట్టుకున్నాయి. మొత్తం 11 ఎయిర్‌క్రాప్ట్స్ ప్రదర్శనలో కొలువుదీరాయి. అయితే నేడు బోయింగ్‌తో పాటు మరికొన్ని ఫ్లైట్స్ ప్రదర్శనలో ఉండనున్నాయి. కరోనా కారణంగా కొన్ని వైమానిక కంపెనీలు రావడంలో ఆలస్యం ఏర్పడిందని నిర్వాహకులు తెలిపారు.
ఇది ఉద్యోగం కాదు.. బాధ్యత
మహిళలు ఏవియేషన్ రంగంలో రాణించడానికి అధికంగా ఆసక్తి చూపిస్తున్నారు. మొదటిసారిగా మన దేశంలో 1947లో కెప్టెన్ ప్రేమ్ మథూర్ అనే మహిళ పైలెట్‌గా సేవలు అందించింది. ఆమె మాకు ఆదర్శం. ఏవియేషన్ రంగంలో మహిళలను పంపించాలంటే తల్లిదండ్రులు ఆలోచిస్తారు. కానీ అమ్మాయిలు వారిని ఒప్పించి ఈ రంగంలోకి వస్తున్నారు. ఇంటర్మీడియెట్ ఎంపీసీ చదివితే చాలు పైలెట్‌గా శిక్షణ తీసుకోవచ్చు. అయితే కేవలం ఈ వృత్తిని ఉద్యోగంగా చూడకూడదు. మన బాధ్యతగా భావించాలి.
– యుతిక రాయ్, పైలెట్
ఏవియేషన్‌పై పరిశోధన చేస్తున్నా..
ఏవియేషన్ రంగానికి సంబంధించి ఈ షో కీలకం. వైమానికంలో ఉపయోగిస్తున్న టెక్నాలజీపైనే అవగాహన పొందొచ్చు. అనేక సెషన్స్ జరుగుతున్నాయి. చాలా మంది పైలెట్స్, కంపెనీ ప్రతినిధులతో మాట్లాడాము. వాతావరణ పరిస్థితులు, ఫ్లైట్ నడపడం వంటి విషయాలను తెలుసుకున్నాం. నేను 1932 నుంచి ఏవియేషన్‌పై పరిశోధన చేస్తున్నాను. అనేక పుస్తకాలు రాశాను. ఏవియేషన్ షోలు నిర్వహించడంలో బేగంపేట్ ఏయిర్పోర్టు వేదిక కావడం గొప్ప విషయం.
– అనురాధ రెడ్డి, ఇంటాక్ కన్వీనర్, ఏవియేషన్ హిస్టారియన్
పైలెట్‌కు ప్రతిదీ సవాలే..
వాతావరణ పరిస్థితులకు తగ్గట్టు ఫ్లైట్‌ను ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. టేకాఫ్ నుంచి ల్యాండింగ్ అయ్యే వరకు ప్రతీది ఒక సవాల్‌గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు పైలెట్ అప్రమత్తంగా ఉండాలి. పక్షులు ఎదరవడం.. వాతావరణ పరిస్థితుల్లో మార్పు రావడం తదితర సవాళ్లను ఎదుర్కోవడంపై శిక్షణ ఇస్తాం. అత్యసర పరిస్థితులపైనా ప్రత్యేకంగా శిక్షణ ఉంటుంది. హైదరాబాద్ ఏవియేషన్‌లో పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంది. నేను హైదరాబాద్‌కు రావడం ఇదే మొదటిసారి.
– ఆంటోనినో జోస్ ఫ్రిగిని జూనియర్, ఫ్లైట్ ఆపరేషన్స్ మేనేజర్
హెలికాప్టర్ల సర్వీస్ అందిస్తున్నాం
మేము జెట్‌సెట్ గో ఏవియేషన్‌తో హెలీకాప్టర్లను క్యాబ్ సర్వీస్‌ల మాదిరిగా నడపలేమా అని ఆలోచించాము. మొదట్లో అదో పెద్ద సాంకేతిక సమస్య.. అనేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది? ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు అని భయపడ్డాం. కానీ తొందరలోనే మేం ఆ నిర్ణయాన్ని అమలు చేశాం. మా సంస్థ ద్వారా మేం కస్టమర్లు కోరుకున్న ప్రాంతాలకు హెలీకాప్టర్ల సర్వీస్‌ను అందిస్తున్నాం.
– శివంగి సింగ్, డిప్యూటీ మేనేజర్, జెట్‌సెట్‌గో