
ఎవరైనా తండ్రి నుంచి వారసత్వంగా ఆస్తి, వ్యాపారాన్ని తీసుకుంటారు. కానీ ఇందుకు భిన్నంగా 20 సంవత్సరాలుగా తండ్రి ఆశయాన్ని కొనసాగిస్తున్నారు సికింద్రాబాద్ శాంతినగర్‌కు చెందిన జి.శ్యాంసన్. రైల్వేలో చిరుద్యోగి అయిన తండ్రి మార్గంలోనే శ్యాంసన్ నడుస్తూ ఎందరో నిరుపేదలు, అనాథలు, వితంతువులు, దివ్యాంగులకు తనవంతు సేవలందిస్తున్నాడు.
తండ్రిని చూసి..
రైల్వేలో చిరుద్యోగి అయిన శ్యాంసన్ తండ్రి అబ్రహం 1987లో సేవా కార్యక్రమాలను ప్రారంభించాడు. ప్రతి నెలా జీతంలో కొంత మొత్తాన్ని కుష్ఠువ్యాధిగ్రస్తులకు ఖర్చు చేసేవాడు. ఇలా తండ్రి సేవలను చూసిన శ్యాంసన్ స్ఫూర్తి పొందాడు. అదే సమయంలో తండ్రి మరణించడంతో ఆయన ఆశయాన్ని బతికించాలని శ్యాంసన్ సంకల్పించుకున్నాడు. 2003లో సికింద్రాబాద్ శాంతినగర్‌లో క్యాప్బౌల్ ఆర్గనైజేషన్‌ను స్థాపించి తన తండ్రి చేసే సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నాడు.
సేవలు ఇలా..
ప్రతి నెల 150 మంది కుష్ఠువ్యాధిగ్రస్తులకు నిత్యావసరాల పంపిణీతో పాటు 50 మంది అనాథలకు క్యాప్బౌల్ ద్వారా ఆశ్రయం కల్పిస్తున్నాడు. విద్యాభ్యాసం చేయిస్తూ ఎదిగిన పిల్లలకు అన్నీ తానై వివాహాలు జరిపిస్తున్నాడు. కరోనా కష్టకాలంలో ఎందరికో బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేశాడు. వలస కార్మికులు స్వగ్రామాలకు వెళ్లేందుకు తోడ్పాటు అందించాడు. హెచ్ఐవీపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు చలికాలంలో ఫుట్‌పాత్‌లపై నిద్రిస్తున్న వారికి 20 సంవత్సరాలుగా షటర్లు, దుప్పట్లను అందిస్తున్నాడు.
సీఎం కేసీఆర్ ప్రశంస..
క్యాప్బౌల్ ఆర్గనైజేషన్ వేదికగా శ్యాంసన్ చేస్తున్న సామాజిక సేవలను సీఎం కేసీఆర్ సైతం ప్రశంసించారు. 2019 ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రిస్మస్ కానుకల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ స్వయంగా క్యాప్బౌల్ ప్రతినిధులతో మాట్లాడి వారు చేస్తున్న సేవలను కొనియాడారు.
సేవలోనే ఆనందం..
నా చిన్నతనం నుంచే మా నాన్న చేసే సేవా కార్యక్రమాలను గమనించేవాడిని. నలుగురికి అన్నం పెట్టినప్పుడే మన జీవితానికి సార్థకత లభిస్తుందని ఎప్పుడూ నాతో అనేవాడు. నాన్న నుంచే స్ఫూర్తి పొంది 2003లో క్యాప్బౌల్ ఆర్గనైజేషన్‌ను ప్రారంభించి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నా. సేవలోనే ఆత్మసంతృప్తి ఉందని నమ్మే తుదిశ్వాస విడిచే వరకు సేవా కార్యక్రమాలు కొనసాగించాలని నిశ్చయించుకున్నా.