
సిటీబ్యూరో, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): స్వచ్ఛమైన కూరగాయలు, మాంసాహారం, చేపలు ఒకేచోట లభించే విధంగా అన్ని వసతులతో కూడిన మోడల్ మారెట్లను ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు జీహెచ్ఎంసీ కృషి చేస్తున్నది. రూ.19.40 కోట్ల అంచనా వ్యయంతో ఐదు చేపల మారెట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన అధికారులు.. ఇప్పటికే నాచారం, కూకట్పల్లి మారెట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే, పురోగతిలో ఉన్న మల్లాపూర్, బేగంబజార్, నారాయణగూడలో మోడల్ మార్కెట్ల నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు గురువారం అధికారులు తెలిపారు.
పనులను నిర్దేశించిన కాలవ్యవధిలో పూర్తి చేసి త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. మోడల్ మార్కెట్లు అందుబాటులోకి రావడంతో ప్రజలకు నాణ్యమైన కూరగాయలు, శుభ్రమైన మాంసాహారం, చేపలు లభించడమే కాకుండా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పడుతుందన్నారు. గతంలో నగరంలో రోడ్లపై అమ్మడం వలన ట్రాఫిక్ సమస్య వచ్చేదని, దీంతో ట్రాఫిక్కు ఆటంకం కలిగిందన్నారు. ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకొని నగర ప్రజల అవసరాలకు అనుగుణంగా నిర్దేశిత ప్రదేశాలను గుర్తించామని, ఆయా ప్రాంతాల్లోనే ఈ మోడల్ మారెట్ల నిర్మాణాలను చేపడుతున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.