
సిటీబ్యూరో, నవంబర్ 18(నమస్తే తెలంగాణ): యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఈ నెల 21న నిర్వహించనున్న కంబైన్డ్ మెడికల్, ఇంజినీరింగ్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలను సజావుగా నిర్వహించాలని హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ ఎం.వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులు సమన్వయంగా పని చేయాలన్నారు. ఇక్కడ మొత్తం కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ కోసం 14 పరీక్షా కేంద్రాలలో 6000 మంది అభ్యర్థులు, ఇంజినీరింగ్ సర్వీసెస్ మెయిన్స్ కోసం ఒక్క కేంద్రంలో 110 మంది చొప్పున అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలను రెండు పూట లా నిర్వహిస్తారు. మెడికల్ పరీక్షలు ఉదయం 9:30 గం టల నుంచి 11:30 గంటల వరకు, తిరిగి మధ్యా హ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు, ఇంజినీరింగ్ మెయి న్స్ పరీక్షలు ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:00 నుంచి 5:00 వరకు నిర్వహించనున్నట్టు తెలిపారు. యూపీఎస్సీ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డుతో పాటు గుర్తిం పు కార్డును తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలన్నారు.
కొవిడ్ నిబంధనలు పాటించాలి..
పరీక్షలకు హాజరు కానున్న అభ్యర్థులు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణ సిబ్బంది, అభ్యర్థులు అందరూ కూడా మాస్కు లు ధరించాలన్నారు. శానిటైజర్లు ఉపయోగిస్తూ, తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలన్నారు. అయితే, మాస్కులు లేకుండా వచ్చిన విద్యార్థులకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. అభ్యర్థులు పరీక్షా సమయం కంటే గంట ముందుగానే చేరుకోవాలన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలకు పరీక్షల హాళ్లోకి అనుమతి లేదన్నారు. హాల్ టిక్కెట్లలో సూచించిన కేంద్రాలలోనే పరీక్షలకు హాజరుకావాలన్నారు. ఈ మేరకు పరీక్షా కేంద్రం సూపర్వైజర్లు, లోకల్ ఇన్స్పెక్షన్ అధికారులు కూడా ఉంటారన్నారు. కార్యక్రమంలో డీసీపీ బాబురావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.