ఆర్కేపురం, మార్చి 6: ఆధునిక ప్రపంచంలో మహిళలు ఆత్మ ైస్థెర్యంతో ముందుకు సాగాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆదివారం ఆర్కేపురం డివిజన్ వాసవీ కాలనీలోని కిన్నెర గ్రాండ్ హాల్లో అంతర్జాతీయ మహిళ దినోత్స వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, రాష్ట్ర టూరిజం అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్, కల్నల్ సంతోష్ బాబు సతీమణి సంతోషి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి కేక్ కట్ చేసి మహిళలందరికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం, ఆమె మాట్లాడుతూ పేద వైశ్యలకు అండగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నిలవటం అభినందనీయమని అన్నారు. ఏ రంగంలో చూసినా మహిళలు రాణిస్తున్నారని, నేల నుంచి ఆకాశ మార్గంలో విమానాలు నడిపే వరకు మహిళలు దూసుకుపోతున్నారని తెలిపారు. స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించటంతో పాటు నామినేటేడ్ పదవుల్లో, పోలీస్ నియామకాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించి మహిళలకు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు.
సీఎం కేసీఆర్ మహిళా బంధుగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని, యావత్ మహిళ లోకం తరుపున ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీ వాణీదేవి మాట్లాడుతూ, ప్రస్తుతం పరిస్థితులు మారాయని, సమాజంలో స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానులేనని పేర్కొన్నారు. అన్ని రంగాల్లోనూ అందరికీ సమానంగా అవకాశాలు ఉన్నాయని తెలిపారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో మహిళలకు సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. మహిళా ఆలోచనలో విప్లవాత్మకమైన మార్పు రావాలని అన్నారు. అనంతరం, పారిశుధ్య కార్మికులకు ఘనంగా సన్మానం చేశారు. పేద మహిళ పెండ్లికి పుస్తె, మెట్టలు, పట్టుచీరను మంత్రి చేతుల మీదుగా అందజేశారు.