ఖైరతాబాద్, మార్చి 6: పేదింట్లో పెండ్లీలకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్.. గర్భిణులకు ఆరోగ్య లక్ష్మి.. పిల్లలు పుడితే కేసీఆర్ కిట్.. ఒంటిరి మహిళలు, ఆసరా పింఛన్లు, పొదుపు సంఘాలకు ప్రత్యేక నిధులు.. ఇలా మహిళా సాధికారతకు సీఎం కేసీఆర్ చేస్తున్న కృషికి అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా పీవీ మార్గ్‌లోని పీపుల్స్‌ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన మహిళా బంధు సంబురాల్లో ప్రత్యేకంగా థాంక్యూ కేసీఆర్ అంటూ ఆడపడుచులు ముక్తకంఠంతో సీఎంకు తమ కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మహిళా దినోత్సవంను పురస్కరించుకొని ప్రభుత్వ, అధికార యంత్రాం గం రాష్ట్రంలో మూడు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
అందులో భాగంగా ఆదివారం పీపుల్స్‌ప్లాజాలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ నేతృత్వంలో ‘మహిళా బంధు’ వేడుకలు నిర్వహించారు. పారిశుధ్య మహిళా కార్మికులు, పొదుపు సంఘాల మహిళలు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశవర్కర్లు పాల్గొని సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టి.. సెల్ఫీలు దిగి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ వేడుకలను మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.
పీపుల్స్ ప్లాజా వద్ద ఆదివారం ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో మహిళా బంధు కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, ఎమ్యెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్లు, ఆశవర్కర్లు, జీహెచ్ఎంసీ మహిళా కార్మికులు పాల్గొని సీఎం చిత్రపటానికి రాఖీలు కట్టారు..
మంత్రులు మహమూద్ అలీ, తలసాని మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ మహిళా సాధికారతకు అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు 6, 7, 8 తేదీల్లో మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామని చెప్పారు. స్త్రీ చదువుకుంటే సమాజం మొత్తం అభివృద్ధి చెందుతుందని భావించి వారి విద్యకు తగిన ప్రాధాన్యతనిచ్చారని, కేజీ టు పీజీ ఉచిత విద్యనందిస్తున్నారని తెలిపారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. స్త్రీ లేనిదే సృష్టి లేదని, సహనం, ఓపికతో పాటు అనుకున్నది సాధించే తత్వం వారిలోనే అధికంగా ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. మన రాష్ట్రంలో మహిళల రక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సోమాజిగూడ, వెంకటేశ్వరకాలనీ కార్పొరేటర్లు వనం సంగీత యాదవ్, మన్నె కవితా రెడ్డి, టీఆర్ఎస్ సోమాజిగూడ డివిజన్ అధ్యక్షుడు ఎస్కే అహ్మద్, మాజీ కార్పొరేటర్ లక్ష్మీనారాయణమ్మ, టీఆర్ఎస్ నాయకులు వనం శ్రీనివాస్ యాదవ్, వైల ప్రవీణ్ కుమార్, ఆనంద్ గౌడ్, సలావుద్దీన్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక ఆకర్షణగా ‘థాంక్యూ కేసీఆర్’ సమూహం
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పీపుల్స్‌ప్లాజా వద్ద జరిగిన ‘మహిళా బంధు’ వేడుకల్లో వందలాది మంది ఆశవర్కర్లు, పారిశుధ్య మహిళా కార్మికులు, ఆరోగ్యకార్యకర్తల సమూహం ‘థాంక్యూ కేసీఆర్’ అంటూ నినదిస్తూ ఏర్పడిన వరుస క్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక్కడ ఏర్పాటు చేసిన వందలాది మంది మహిళలు కేసీఆర్ కటౌట్లకు రాఖీలు కట్టి, సెల్ఫీలు దిగి సంబురపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆడపడుచులకు చీరలు పంపిణీ చేశారు.
మహిళా నేతలకు సత్కారం
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ కె. ప్రసన్న, కార్పొరేటర్లు వనం సంగీతా యాదవ్, మన్నె కవితా రెడ్డి, మాజీ కార్పొరేటర్ లక్ష్మీనారాణమ్మను జ్ఞాపికలు, శాలువాలతో అతిథులు సత్కరించారు.