
సుల్తాన్‌బజార్, నవంబర్ 17: విద్యాభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం కోఠిలోని మహిళా కళాశాలలో 16వ స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కోఠి మహిళా కళాశాలలో చదువుకోవాలనే ఆసక్తితో తాను అడ్మిషన్ కోసం వేచి చూశానని, సీటు రాలేదన్నారు. చదువుకుని డిగ్రీ పట్టా తీసుకోవాలని ఆశించాను.. నేడు ముఖ్య అతిథిగా వచ్చి విద్యార్థినులకు డిగ్రీ పట్టాలను అందజేస్తున్నాను.. అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. నాడు అమ్మాయిలను చదివించాలనే ఆసక్తి తల్లిదండ్రులకు ఉన్నా..
ఆర్థిక స్థోమత లేక అబ్బాయిలను చదివించేవారన్నారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ఇందుకు రాష్ట్రంలో 53 డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలలను ఏర్పాటు చేశారన్నారు. అందులో 40 బాలికల రెసిడెన్షియల్ కళాశాలలు ఉన్నాయన్నారు. గోల్డ్ మెడల్స్, డిగ్రీ పట్టాలను అందుకున్న విద్యార్థులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. కళాశాలలో నూతన హాస్టల్ బ్లాక్ ఏర్పాటు అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని మంత్రి తెలిపారు. కర్ణాటక అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, కళాశాల పూర్వ విద్యార్థిని ఐఏఎస్ హెప్సిబా ఆర్ కోర్లపాటి మాట్లాడుతూ..
కళాశాలలోకి అడుగుపెట్టగానే తాను విద్యను అభ్యసించే సమయాన్ని గుర్తు చేసుకున్నానన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్య శాతాన్ని మరింత మెరుగుపర్చేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందన్నారు. ఓయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ డి.రవీందర్ మాట్లాడుతూ.. ఈ కళాశాలలో నూతన హాస్టల్ బ్లాక్ నిర్మాణానికి సహకరించాలని మంత్రికి విన్నవించారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.విజ్జులత మాట్లాడుతూ.. కళాశాలలో నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం 95.63 ఉన్నదన్నారు. ఎనిమిది మంది విద్యార్థినులు గోల్డ్ మెడల్స్ అందుకున్నారు.