
సిటీబ్యూరో, నవంబర్ 17(నమస్తే తెలంగాణ): రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ ఒక వైపు మత్తు దందా పై ఉక్కుపాదం మోపుతూనే.. మరో వైపు వాటి బారిన పడిన వారిని మార్చేందుకు ‘నయా సవేరా’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా రాచకొండ పోలీసులు, స్వచ్ఛంద సంస్థ అమృత ఫౌండేషన్ ప్రతినిధులు యువత, విద్యార్థులు మత్తు జోలికి పోకుండా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎవరైనా డ్రగ్స్, గంజాయి, సిగరెట్, ఇతర మత్తు పదార్థాలకు బానిసలుగా మారి వాటిని వదులుకోలేకపోతున్నామని భావిస్తే వారు ఈ నయా సవేరా కార్యక్రమంలో పాల్గొంటే..కౌన్సెలింగ్ ఇచ్చి మార్చేందుకు ప్రయత్నిస్తారు.
డ్రగ్స్‌కు అలవాటుపడిన మొత్తం 12 మందికి అమృత ఫౌండేషన్ ప్రతినిధులు డాక్టర్ దేవికారాణి, శ్రీపూజ, రాచకొండ ఏహెచ్‌టీయూ-నోడల్ అధికారి చంద్రశేఖర్ మంగళవారం కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇక ప్రతి మంగళవారం రాచకొండ పోలీసు కమిషనర్ క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సీపీ తెలిపారు. కౌన్సెలింగ్ కావాలనుకునే వారు రాచకొండ వాట్సాప్ 9490617111 నంబర్లో సంప్రదించాలని సూచించారు.