సిటీబ్యూరో, మార్చి 3 (నమస్తే తెలంగాణ): ‘అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిన డార్క్‌వెబ్ అంతు చూస్తాం.. సైబర్, డ్రగ్స్‌కు సంబంధించిన నేరాలు చేస్తున్న కొందరు ఆఫ్రికన్, నైజీరియన్లను కట్టడి చేస్తాం.. ఇందుకోసం సిటీ పోలీస్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందిస్తాం’ అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. సైబర్‌నేరాలు, మాదకద్రవ్యాలను పూర్తిస్థాయిలో కట్టడి చేసే లక్ష్యంతో వివిధ కేంద్ర దర్యాప్తు, శిక్షణ సంస్థల అధికారులతో గురువారం కమిషనరేట్ కార్యాలయంలో ఆయన సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. నేషనల్ పోలీస్ అకాడమీ జాయింట్ డైరెక్టర్ అమిత్ గార్గ్, మధుసూదన్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) జాయింట్ డైరెక్టర్ సంబంధన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్, సౌత్ సీఆర్పీసీ ఐజీ మహేశ్ లడ్డా తదితర అధికారులు హాజరయ్యారు.
ఇందులో ప్రధానంగా సైబర్‌నేరాలు, మాదక ద్రవ్యాల కేసులు, డార్క్ వెబ్ కేసుల పరిశోధన.. అందుకు కావాల్సిన అత్యసరమైన శిక్షణ అందించే విషయంపై చర్చించారు. క్రిప్టోకరెన్సీ మోసాలపై దృష్టి పెట్టి, వాటి వాడకంపై కూడా నిఘా పెట్టాలని, సైబర్‌నేరాలు, మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసుల్లో ఆఫ్రికన్, నైజీరియన్ దేశస్తుల పాత్ర కీలకంగా ఉంటుందని, వారిని కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడారు. నేషనల్ పోలీస్ అకాడమీ ఆధ్వర్యంలో ఆయా అంశాలపై నగర పోలీసులకు ప్రత్యేక మాడ్యూల్స్ నిర్వహించి.. ఆచరణాత్మక అవగాహన కల్పించాలని సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయించారు.