
బంజారాహిల్స్, కొండాపూర్, నవంబర్ 17: ‘డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు.. నా వద్ద డబ్బులు లేవు పేటీఎం చేస్తా.. అని చెప్పినా వినకుండా దాడి చేశాడు’.. అంటూ మూడురోజుల కిందట బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు వద్ద తనపై జరిగిన దుండగుడి దాడిపై సినీనటి షాలూ చౌరాసియా స్పందించారు. బుధవారం కొండాపూర్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ సుమారు మూడేండ్లుగా తాను కేబీఆర్ పార్కు వద్ద వాకింగ్ చేస్తున్నానని, ఏనాడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని చెప్పారు. ‘రోజు మాదిరిగానే సీవీఆర్ గేట్ సమీపంలో కారు పార్క్ చేసి.. సాయంత్రం 6 గంటల సమయంలో వాకింగ్‌కు వెళ్లాను. రాత్రి 8:15 గంటల సమయంలో మెయిన్‌గేట్ వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా, స్టార్ బక్స్ సమీపంలోకి రాగానే దుండగుడు దాడి చేశాడు. కిందకు తోసేయడంతో పాటు తప్పించుకునే అవకాశం లేకుండా ముఖాన్ని పక్కనే ఉన్న బండరాయికి అదిమిపెట్టాడు. డబ్బులు ఇవ్వకపోతే ఇక్కడే చంపేస్తానని బెదిరించాడ’ని చెప్పారు.
తన వద్ద డబ్బులు లేవని.. పేటీఎం చేస్తాననంటూ.. ఫోన్లో డయల్ 100కు కాల్ చేశానని, దీంతో తనపై మరింత బలంగా దాడి చేయడంతో పాటు ఫోన్ లాక్కుని పారిపోయాడని వివరించారు. తన మీద బండరాయి వేసి చంపేందుకు కూడా ప్రయత్నించాడని చెప్పారు. సంఘటన జరిగిన వెంటనే తాను డయల్ 100కు ఫోన్ చేశానని, పోలీసులు వేగంగా స్పందించారని, రోజూ తనతో ఫోన్లో మాట్లాడుతున్నారని, అనుమానితుల వివరాలు పంపిస్తున్నారని పేర్కొన్నారు.