మన్సూరాబాద్, ఫిబ్రవరి 28: అందరూ అరవై ఏండ్లపై బడిన వారే.. అయితేనేమీ.. కార్యసాధనకు వయస్సు అడ్డు కాదని భావించారు. ఐక్యమత్యంతో అడుగుముందుకేశారు.. అనుకున్నది సాధించారు.. అందమైన భవనాన్ని నిర్మించుకున్నారు. మన్సూరాబాద్ డివిజన్ సహారాస్టేట్స్‌కాలనీలో నివసించే రిటైర్డ్ ఉద్యోగులందరూ కాలక్షేపంతో పాటు సంఘ సేవ కూడా చేసేందుకు 2006లో సీనియర్ సిటిజన్స్ ఫోరం, డే కేర్ సెంటర్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం 120 మంది సభ్యులుగా ఉన్నారు. ఎలాంటి కష్టకాలమైన వారంతా కలిసి ముందుకొచ్చి సంఘ సేవ చేస్తూ ఇతరులను ప్రోత్సహిస్తున్నారు. సొంత భవనం లేక ఇబ్బందులు పడుతున్న సహారా కాలనీకి చెందిన సీనియర్ సిటిజన్స్ ఫోరం సభ్యులకు సహారా మెయింటెనెన్స్ కమిటీ సహకారం అందించేందుకు ముందుకు వచ్చింది.
సొంత ఖర్చులతో భవన నిర్మాణం..
సీనియర్ సిటిజన్స్ ఫోరం భవనానికి భూమి ఇచ్చేందుకు సహారా మెయింటెనెన్స్ కమిటీతో పాటు కాలనీవాసులు ఆమోదం తెలిపారు. దీంతో సీనియర్ సిటిజన్స్ ఫోరం సభ్యులు రూ.6.50లక్షలతో భవనాన్ని నిర్మించారు. ఇక నుంచి వారి కార్యకలాపాలు సొంత భవనం నుంచే నిర్వహిస్తారు.
త్వరలో ప్రారంభిస్తాం
సుమారు రూ.6.50లక్షలతో సహారాకాలనీలో సీనియర్ సిటిజన్స్ ఫోరం, డే కేర్ సెంటర్ భవనాన్ని నిర్మించాం. ఇందులో అంతా రిటైర్డ్ ఉద్యోగులమే సభ్యులుగా ఉన్నాం. భవన నిర్మాణం పూర్తయ్యింది. త్వరలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి, మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి చేతులమీదుగా భవనాన్ని ప్రారంభించుకుంటాం. భవన నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
– శీనయ్య, సహారా సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షుడు
ఆహ్లాదకరమైన వాతావరణం
సీనియర్ సిటిజన్స్ ఫోరం భవనాన్ని ఎంతో అందంగా నిర్మించాం. సీనియర్స్ సేద తీరేందుకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాం. డే కేర్ సెంటర్లో ఉదయం వ్యాయామం చేసుకునేందుకు కావాల్సిన పరికరాలను సిద్ధం చేశాం. క్యారమ్, చెస్ తదితర ఆటలు ఆడుకునేలా వసతులు కల్పించాం. డే కేర్ సెంటర్‌కు వచ్చే ప్రతి ఒక్కరికీ సీనియర్ సిటిజన్స్ భవనం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. 120 మంది సభ్యుల అవసరాలకు అనుగుణంగా సీనియర్ సిటిజన్స్ భవనాన్ని నిర్మించారు.
– సీహెచ్ పెంటయ్య, సహారా సీనియర్ ,సిటిజన్స్ ఫోరం ప్రధాన కార్యదర్శి