
ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 17: హైదరాబాద్ మహానగరం జియోస్పేషియల్ హబ్‌గా అభివృద్ధి చెందుతుందని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్, డైరెక్టర్ డాక్టర్ ఎన్. సత్యనారాయణ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ జాగ్రఫీ విభాగం, జియో మాప్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సత్యనారాయణ మాట్లాడుతూ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఫైబర్ గ్రిడ్, పట్టణ పరిపాలన, డిజాస్టర్ మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో జీఐఎస్ సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతున్నదని చెప్పారు. అనంతరం వివిధ అంశాలపై కేంద్ర శాస్త్రసాంకేతిక మంత్రిత్వ శాఖకు చెందిన ఎన్ఎస్డీఐ మాజీ సీఈవో మేజర్ జనరల్ శివకుమార్, జియో మాప్ సొసైటీ, సర్వే ఆఫ్ ఇండియా మాజీ డైరెక్టర్ జీఎస్ కుమార్ ప్రసంగించారు. కార్యక్రమంలో జాగ్రఫీ విభాగం హెడ్ ప్రొఫెసర్ శ్రీనగేశ్, డీన్ ప్రొఫెసర్ బాలకిషన్, జియోఫిజిక్స్ విభాగం హెడ్ ప్రొఫెసర్ వీరయ్య తదితరులు పాల్గొన్నారు.