తెలుగుయూనివర్సిటీ, ఫిబ్రవరి 23: సమాజానికి సేవ చేయాలనే ఉన్నతమైన భావాలు కలిగిన వారే సివిల్ సర్వీసులోకి రావాలని యువతకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి సూచించారు. ధనార్జనే ధ్వేయం అనుకుంటే ఇతర వ్యాపాకాలు చూసుకోవాలని ఆయన హితవు పలికారు. తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పరిణతవాణి ప్రసంగ కార్యక్రమంలో భాగంగా 99వ ప్రసంగం రమణాచారి చేశారు. కష్టపడి చదువుకుని ఉద్యోగం సంపాదించిన తనకు ఏ హోదాలో ఉన్నా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి మానవీయ థృక్పథంలో సేవలు అందించానన్న తృప్తి దక్కిందని తెలిపారు. పరిషత్ అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ రమణాచారి సాహితీ సృజనలో, పరిశోధనలోనూ విశేష కృషి చేశారని తెలిపారు. గురువారం ఉదయం 11 గంటలకు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి 100వ ప్రసంగం చేయనున్నారని పరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జుర్రు చెన్నయ్య వెల్లడించారు.