సిటీబ్యూరో, ఫిబ్రవరి 23(నమస్తే తెలంగాణ)/చంపాపేట: కర్మన్‌ఘట్‌లో మంగళవారం రాత్రి చోటు చేసుకున్న పరిణామాలపై పోలీసులు అత్యంత సమర్థవంతంగా వ్యవహరించారు. వేగంగా స్పందించి.. పరిస్థితిని చక్కదిద్దారు. ఏడుగురు నిందితులను పట్టుకున్నారు. ఆ ప్రాంతంలో పికెటింగ్ ఏర్పాటు చేసి.. ప్రశాంతంగా ఉండేలా పటిష్టమైన చర్యలు చేపట్టారు. మత విద్వేషాలు రెచ్చగొడితే.. ఊరుకునేది లేదని గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
అసలేం జరిగిందంటే..
గోవుల తరలింపు వ్యవహారం కర్మన్‌ఘాట్‌లో మంగళవారం రాత్రి ఉద్రిక్తతకు దారితీసింది. పశువులను తరలిస్తున్న వారిని అడ్డుకున్న గో రక్షక్ సేవకులపై వారు దాడులకు దిగడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఓ దశలో వారు దేవాలయంలోకి చొరబడి గో రక్షక్ సేవకులపై దాడికి తెగబడ్డారనే ప్రచారం జరిగింది. దీంతో గో రక్షక్ సేవకులతో పాటు మరికొందరు నిరసనలతో హోరెత్తించారు. పోలీసుల వాహనాలపై రాళ్ల వర్షం కురిపించారు. హూటాహుటిన రంగంలోకి దిగిన పోలీసు ఉన్నతాధికారులు భారీగా సిబ్బందిని మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ గొడవలపై మొత్తం ఐదు కేసులను నమోదు చేశారు. అక్రమంగా లేగదూడలను తరలిస్తున్న ఏడుగురిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. కర్మన్‌ఘాట్ ప్రాంతంలో పోలీసు పికెటింగ్‌లను ఏర్పాటు చేశారు. సీపీ మహేశ్ భగవత్ సంఘటన ప్రాంతాన్ని బుధవారం ఉదయం పరిశీలించి పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు.
మాల్లో కొనుక్కొని..
నగరంలోని భవానీనగర్‌కు చెందిన మహ్మద్ యూసుఫ్, అతడి కుమారుడు మహ్మద్ నిస్సార్ మంగళవారం నల్గొండ జిల్లా మాల్లో ఐదు లేగ దూడలను కొనుక్కొని బొలెరో వాహనంలో వాటిని భవానీ నగర్‌కు తరలిస్తున్నారు. మీర్పేట్ గాయత్రీనగర్ వద్ద మయూరేశ్ తన స్నేహితులతో కలిసి ఆ వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించాడు. వాహనంలో ఉన్న తండ్రి కొడుకులు వాగ్వాదానికి దిగుతూ.. వారిని దుర్భాషలాడుతూ.. ఇనుప రాడ్‌తో దాడి చేసేందుకు యత్నించారు. ఈ గొడవలో బొలెరో వాహనం డ్రైవర్ లింగమయ్య తలకు తీవ్ర గాయాలయ్యాయి. భయాందోళనలో మయూరేశ్ అతడి స్నేహితులు ఎదురుగా ఉన్న హనుమాన్ దేవాలయంలోకి ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు తీశారు. మహ్మద్ యూసుఫ్, అతడి కుమారుడు నిస్సార్ వారి స్నేహితులు మహ్మద్ నవాజ్, మహ్మద్ గౌస్, మహ్మద్ అయూబ్, మహ్మద్ మోసిన్ కమాల్‌తో కలిసి మారణాయుధాలతో హనుమాన్ దేవాలయం ప్రాంగణంలోకి ప్రవేశించి.. దాడి చేసి మయూరేశ్, అతడి స్నేహితులను చంపేందుకు ప్రయత్నించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన పోలీసులు మొత్తం ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఐదు లేగదూడలను స్వాధీనం చేసుకుని వాటిని యుగ తులసి ఫౌండేషన్ గోశాలకు తరలించారు.
రాళ్ల దాడిలో ఎస్సైకి గాయాలు
లేగదూడలను తరలిస్తున్న బొలెరో వాహనాన్ని నడిపిస్తున్న లింగమయ్య ఫిర్యాదుపై గోరక్షక్ కార్యకర్తలపై కేసును నమోదు చేశారు. ఈ దాడిలో లింగమయ్యకు తలకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా, కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయం దగ్గర గో రక్షక్ సంస్థలకు చెందిన అనేక మంది కార్యకర్తలు, యువకులు చేరుకొని.. నిరసనకు దిగారు. ప్రధాన రోడ్డుపై అందరూ రావడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ గుంపును పక్కకు తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న క్రమంలో కొందరు అల్లరి మూకలు రెచ్చగొట్టే విధంగా నినాదాలు చేస్తూ.. రాళ్లను రువ్వడం మొదలు పెట్టారు. ఈ దాడిలో వనస్థలిపురం ఎస్ఐ మాధవరెడ్డికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని వెంటనే దవాఖానకు తరలించారు. పోలీసు విధులను అడ్డుకోవడంతో పాటు పోలీసు వాహనాలను ధ్వంసం చేసినందుకు అల్లరి మూకలపై సరూర్‌నగర్ పీఎస్‌లో కేసులు నమోదు చేశారు.
విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెడితే ఊరుకోం
‘కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయం వద్ద పరిస్థితి ప్రశాంతంగా ఉంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ స్పష్టం చేశారు. ఈ సంఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. విద్వేషాలు రెచ్చగొడితే సహించేది లేదన్నారు. ఉద్రిక్తతకు దారి తీసిన సంఘటనలపై శాస్త్రీయంగా, సాంకేతికంగా దర్యాప్తును ప్రారంభించామని సీపీ పేర్కొన్నారు. అక్రమంగా పశువులను రవాణాను అడ్డుకున్న వారిపై దాడికి పాల్పడిన నిందితులను అతి వేగంగా పట్టుకున్న హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ అధికారులు, సిబ్బంది పని తీరును అభినందించారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ సహకారానికి సీపీ కృతజ్ఞతలు తెలిపారు.