సికింద్రాబాద్, ఫిబ్రవరి 21: ఎన్సీసీలో శిక్షణ పొందిన ఎంతోమంది పూర్వ విద్యార్థులు ప్రస్తుతం వివిధ రంగాల్లో దేశానికి సేవలందిస్తుండడం గర్వకారణమని ఎన్సీసీ డైరెక్టర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్పాల్ సింగ్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్సీసీ డైరెక్టరేట్ కార్యాలయాన్ని గుర్బీర్పాల్ సింగ్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుతం శిక్షణ పొందుతున్న ఎన్సీసీ క్యాడెట్లతో పాటు ప్రస్తుతం వివిధ రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్న పూర్వ విద్యార్థులతో కొంతసేపు ముచ్చటించి వారికి అభినందనలను తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ నలుమూలల్లో ఉన్న అతిపెద్ద డైరెక్టరేట్లలో ఏపీ, తెలంగాణ డైరెక్టరేట్ ఒక్కటన్నారు. ఈ డైరెక్టరేట్ పరిధిలో ప్రస్తుతం 1.25 లక్షలమంది క్యాడెట్లు శిక్షణ పొందుతున్నారని తెలిపారు. ఇందులో శిక్షణపొందిన ఎంతోమంది పూర్వ విద్యార్థులు ప్రస్తుతం వివిధ రంగాల్లో ఉన్నత స్థానాల్లో కొనసాగుతున్నారన్నారు. ఈ సంవత్సరం ఎన్సీసీలో నూతన పథకాలు అమలులోకి వచ్చాయని గుర్బీర్పాల్ సింగ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శిక్షణలో ప్రతిభను కనబరుస్తున్న క్యాడెట్లకు ఆయన మెమోంటోలను అందజేశారు.