బంజారాహిల్స్,ఫిబ్రవరి 21: ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లను నిర్మించుకున్న వారి స్థలాలను క్రమబద్ధ్దీకరించేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 58, 59 కింద దరఖాస్తుల స్వీకరణ సోమవారం ప్రారంభమయింది. షేక్‌పేట, ఖైరతాబాద్ మండలాల పరిధిలోని బస్తీలు, కాలనీల్లో ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు కలిగిన వారు మీ సేవ కేంద్రాల్లో క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. జీవో 58కింద దరఖాస్తులు చేసుకునేవారు ప్రభుత్వానికి ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం మీసేవావ కేంద్రంలో సర్వీస్ ఛార్జీ మాత్రం వసూలు చేస్తున్నారు. కాగా జీవో 59 కింద దరఖాస్తు చేసుకునేందుకు రూ.1050 దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుల పరిశీలన తర్వాత జీవో 59కింద అన్ని విధాలుగా అర్హత ఉంటే ప్రభుత్వం నిర్దేంచిన రుసుంను చెల్లించాల్సి ఉంటుంది.
అభ్యంతరాలు లేని భూములే క్రమబద్ధ్దీకరణ..
జీవో 58, 59 కింద దరఖాస్తులు చేసుకునేవారు కొన్ని విషయాలను గమనించాల్సి ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు. ఎలాంటి అభ్యంతరాలు లేని ప్రభుత్వ భూములలోని ఇండ్లను మాత్రమే క్రమబద్ధ్దీకరణ చేస్తారు. చెరువు శిఖం భూములు, కుంటలు, కొండలు, శ్మశానవాటిక స్థలాలు, రోడ్లు, పార్కులు తదితర స్థలాల్లో ఇండ్లను కట్టుకునేవారికి క్రమబద్ధీకరణ వర్తించదని అధికారులు తెలిపారు. కేవలం అభ్యంతరం లేని ప్రభుత్వ భూములతో పాటు యూఎల్సీ ల్యాండ్స్‌లోని ఇండ్లను మాత్రమే ఈ జీవోల క్రింద క్రమబద్ధీకరిస్తారు. ప్రభుత్వం జీవో ప్రకారం 2014 జూన్ 2నాటికి ఇండ్లు కలిగి ఉన్న వారికే ఈ అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. వార్షిక ఆదాయం 2లక్షల లోపు ఉన్న బీపీఎల్ కుటుంబాలకు 125గజాల స్థలం దాకా ఉచితంగా జీవో 58 కింద క్రమబద్ధీకరణ చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
దరఖాస్తు చేసుకోవడం ఇలా..
క్రమబద్ధ్దీకరణ కోసం దరఖాస్తులు చేసుకునేవారు కచ్చితంగా కొన్ని పత్రాలను జతపర్చాల్సి ఉంటుంది.
నిర్దేశిత దరఖాస్తు ఫారంలో వివరాలు నమోదు చేయాలి
దరఖాస్తుదారుడి పేరు, తండ్రిపేరు తదితర వివరాలు ఆధార్ నంబర్‌ను దరఖాస్తులో నింపాలి.
ఇంటికి సంబంధించిన పూర్తి చిరునామా, మండలం, సర్వే నంబర్ తదితర వివరాలను దరఖాస్తులో పేర్కొన్నాలి.
ఇంటి విస్తీర్ణం, ఖాళీ స్థలం వివరాలను తెలపాలి.
క్రమబద్ధ్దీకరణ కోరుకుంటున్న స్థలం మొత్తం విస్తీర్ణం స్పష్టంగా తెలపాలి.
ఇంటికి చెందిన నాలుగు వైపులా హద్దులను స్పష్టంగా రాయాలి.
ఇంటికి సంబంధించిన ఫొటోను అప్లోడ్ చేయాలి.
ఇంట్లో తాము నివాసం ఉంటున్నట్లు సూచించే ఆధారాలు దరఖాస్తుతో పాటు అప్లోడ్ చేయాలి
ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్, ఆస్తిపన్ను రశీదు, కరెంట్ బిల్లు, నల్లా బిల్లు రశీదులను జతపర్చాలి