సిటీబ్యూరో, ఫిబ్రవరి 20 (నమస్తేతెలంగాణ) : గ్రేటర్‌వ్యాప్తంగా రహదారి ప్రమాదాలను నియంత్రించేందుకు సంయుక్త కార్యాచరణ ప్రారంభమైంది. అతివేగం, ర్యాష్ డ్రైవింగ్‌పై మూడు కమిషనరేట్ల పోలీసులు దృష్టిసారించి శాస్త్రీయ వేగ విధానాన్ని నిర్ధారించారు. ప్రస్తుతం ప్రాంతానికో స్పీడ్ లిమిట్ ఉండడంతో అన్ని వాహనాలకు ఒకేరకమైన జరిమానా విధిస్తున్నారు. ఇందులో మార్పులు చేస్తూ గ్రేటర్‌వ్యాప్తంగా ఒకే విధానం ఉండాలని తాజాగా అన్ని విభాగాల అధికారులతో కలిసి ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. స్పీడ్ లిమిట్ పెట్టి వాహన వేగం పెరిగిన కొద్దీ జరిమానా విధించనున్నారు. విశాలమైన ఔటర్‌పై గంటకు 100 కిలోమీటర్లు, పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై గంటకు 80 కిలోమీటర్లు, కాలనీలు, సింగిల్ రోడ్లలో 30 మాత్రమే వేగం ఉండాలి. అంతేకాదు డేంజర్ డ్రైవింగ్‌పై జరిమానాతోపాటు చార్జిషీట్ దాఖలు చేసి వాహనదారుడిని కోర్టులో హాజరుపరుస్తారు. కాగా పలు ఉల్లంఘనలకు పాల్పడి చలాన్లు నమోదైనా చాలామంది చెల్లించడం లేదు. ఏటా బకాయిలు పెరుగుతుండడంతో చలాన్ల చెల్లింపునకు ప్రత్యేకంగా రాయితీ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. నేరుగా రాయితీ ఇవ్వాలా? లోక్‌అదాలత్ ద్వారా ఇవ్వాలా?అన్న విషయం త్వరలో తేలనుంది.
సిటీలో ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో అన్ని విభాగాలతో చర్చించి వేగ పరిమితిని పెంచడంపై ట్రాఫిక్ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఒకే విధానం ఉండాలని నిర్ణయించి.. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న చలాన్లు వసూళ్లు చేసేందుకు భారీగా రాయితీలు ఇవ్వాలని సన్నాహాలు చేస్తున్నారు. ఔటర్‌రింగ్‌రోడ్డు అంతర్భగంలో ఉండే రహదారులపై వేగ పరిమితులను పెంచారు. గతంలో ఒక్కో చోట ఒక్కో వేగ నియంత్రణ పరిమితి ఉండేది. అలాంటి వాటిని గుర్తించి.. రహదారులను బట్టి వేగ నియంత్రణ ఉండాలని నిర్ణయించారు. వాహనాలకు వేగాన్ని బట్టి జరిమానాలు పెరిగే విధానాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
వేగ పరిమితిపై కీలక నిర్ణయాలు
డివైడర్లు ఉండి, పాదచారులు దాటేందుకు వీలు లేని రోడ్లలో కారు గంటకు 60 కీలోమీటర్లు, బైక్ 50, భారీ వాహనాలకు 40గా నిర్ణయించారు.
డివైడర్లు లేని రహదారుల్లో పాదచారులు రోడ్డు దా టేందుకు ఎక్కువ ఆస్కారం ఉండడంతో కారుకు 50, బైక్ 40, భారీ వాహనాలకు 30గా నిర్ణయించారు.
కాలనీల్లోని రోడ్లతో పాటు సింగిల్ రోడ్లలో గంటకు 30 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెళ్లాలి.
పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవేపై గంటకు 80 కి.మీలు.
ఓఆర్ఆర్పై గంటకు 100 కిలోమీటర్ల వేగం.
జరిమానాలు కూడా తగ్గింపు…
ప్రస్తుతం అతివేగంగా వెళ్లే వాహనాలకు రూ. 1400 వరకు జరిమానా పడుతున్నది. దీనిని తగ్గించారు. బైక్, కారు, భారీ వాహనాలకు వేర్వేరు విధానాన్ని అవలంభించనున్నారు. బైక్ పరిమితికి మించిన వేగంతో వెళ్లిందంటే ఆ వాహనానికి రూ. 300తో జరిమానా మొదలవుతుంది.. వేగం ఎక్కువగా పెరిగితే ఫైన్ మరింతగా పెరుగుతుంది. వేగం 80కి చేరితే.. సుమారు 400 వరకు.. అదే కారుకు కనీసం రూ. 500 ఫైన్ ఉంటుంది.. వేగం పెంచితే.. జరిమానా కూడా రెట్టింపవుతుంది. అదే గంటకు వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణించారంటే.. సుమారు వెయ్యికిపైగానే జరిమానా విధిస్తారు. భారీ వాహనాలకు కనీస జరిమానా రూ. 700 కాగా.. పెరిగే స్పీడును బట్టి.. చలాన్ వేస్తారు. ఇక 100 నుంచి 120 వరకు వేగం పెరిగిందంటే అలాంటి వారిపై జరిమానా విధించడంతో పాటు చార్జిషీట్ కూడా దాఖలు చేస్తారు.
పెండింగ్ చలాన్లకు ప్రత్యేక రాయితీలు
నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీగా చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ద్విచక్రవాహనదారులపైనే ఇవి ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో పెండింగ్ చలాన్లు వసూలు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని భారీగా రాయితీలు ఇచ్చి, బకాయిలు వసూలు చేయాలనే యోచనలో ఉన్నారు.