మేడ్చల్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. 11 కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 1062 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, ఇందుకు సంబంధించిన నగదును మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. మేడ్చల్ జిల్లాలో అక్టోబర్ 26న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. వరి కోతలు ప్రారంభమైన నాటి నుంచి వీటిని అన్నదాతల కోసం అందుబాటులో ఉంచారు. పండించిన ధాన్యాన్ని పూర్తిగా కొనేంత వరకు కొనసాగించనున్నారు.
అంచనా.. 30 వేల మెట్రిక్ టన్నులు
మేడ్చల్ జిల్లావ్యాప్తంగా 18,426 ఎకరాల విస్తీర్ణంలో ఖరీఫ్‌లో వరి సాగు చేయగా, 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందుకోసం సూమారు రూ. 58 కోట్లను రైతులకు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఏదులాబాద్, ప్రతాపసింగారం, మాదారం, కేశవరం, లక్ష్మాపూర్, కీసర, డబిల్పూర్, మేడ్చల్, పూడుర్లలో కేంద్రాలను నిర్వహిస్తున్నారు. పౌర సరఫరాల, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల పర్యవేక్షణలో కొనుగోలు జరుగుతున్నాయి. కాగా, వానాకాలంలో పండించిన వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. అయితే యాసంగిలో వరిని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయరాదని నిర్ణయించిన నేపథ్యంలో టీఆర్ఎస్ శ్రేణులు రైతుల పక్షాన ఉద్యమిస్తున్నారు. వడ్లు కొనేంత వరకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు.