Upasana | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన కొణిదెల దంపతులు ఇటీవల పండంటి కవలలకు జన్మనివ్వడంతో మెగా కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. జనవరి 31న ఉపాసన ఒక మగ బిడ్డకు, ఒక ఆడ బిడ్డకు జన్మనివ్వగా ఈ శుభవార్త తెలిసిన వెంటనే అభిమానులు భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రి వద్దకు వేలాది మంది అభిమానులు చేరుకుని రామ్ చరణ్–ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం ఉపాసన తన కవల పిల్లలతో ఇంటికి చేరగా, సంప్రదాయబద్ధంగా నామకరణ మహోత్సవాన్ని కూడా కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో నిర్వహించినట్లు సమాచారం. పండితుల సూచనలు, జాతక వివరాల ప్రకారం పిల్లలకు పేర్లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
కూతురికి “అన్వీరా దేవీ”, కుమారుడికి “శివరామ్” అనే పేర్లు పెట్టినట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి. అన్వీరా దేవీ అనే పేరుకు ధైర్యవంతురాలైన అమ్మవారు అనే అర్థం వస్తుందని చెబుతున్నారు. ఇక కుమారుడి పేరులో మెగాస్టార్ చిరంజీవి అసలు పేరులోని “శివ” పదాన్ని, రామ్ చరణ్ పేరులోని “రామ్” పదాన్ని కలిపి “శివరామ్”గా నామకరణం చేసినట్లు సమాచారం. ఈ పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ మెగా అభిమానుల నుంచి విపరీతమైన స్పందన పొందుతున్నాయి.
ఇక సినీ విషయానికి వస్తే ప్రస్తుతం రామ్ చరణ్ గ్రామీణ క్రీడల నేపథ్యంలోని స్పోర్ట్స్ డ్రామా చిత్రం పెద్దిలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే మీర్జాపూర్ ఫేమ్ నటుడు దివ్యేందు త్రిపాఠి, జగపతి బాబు, కమెడియన్ సత్య తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మొదట మార్చి 26న విడుదల చేయాలని భావించిన ఈ చిత్రాన్ని అనివార్య కారణాల వల్ల ఏప్రిల్ 30కు వాయిదా వేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. మెగా అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు.