బంజారాహిల్స్,ఫిబ్రవరి20: జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్‌లోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ నిర్మాణాన్ని చేపట్టాలనే డిమాండ్‌తో ఆలయ పోరాట సమితి ఏర్పాటైంది. ఆదివారం బంజారాహిల్స్‌లోని కళింగ కల్చరల్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాధన సమితి ప్రతినిధులు పల్లపు గోవర్దన్, సుధాకర్ రెడ్డి, శివన్న తదితరులు వివరాలను వెల్లడించారు. రామానాయుడు స్టూడియోస్ కింది భాగంలోని ప్రభుత్వ స్థలంలో శ్రీ అభయాంజనేయస్వామి ఆలయాన్ని పునరుద్ధ్దరించాలని ఏడాదిగా పలు హిందూ సంస్థలు ఆందోళన నిర్వహిస్తున్నాయని, ఆలయం కోసం 2వేల గజాల స్థలాన్ని కేటాయిస్తున్నట్లు ఇటీవల నిర్మాణ సంస్థ పత్రికా ప్రకటనలు ఇచ్చినా ఇప్పటివరకు స్థలం కేటాయింపు ప్రక్రియ మాత్రం ప్రారంభం కాలేదన్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ చేపట్టేందుకు వీహెచ్‌పీ అధ్యక్షుడు రామరాజు, భజరంగ్ దళ్ నేత సుభాష్‌తో సహా ఫిలింనగర్ 18బస్తీలకు చెందిన నాయకులు, 25మంది పీఠాధిపతులు, నగరంలోని భక్తులతో కలిసి పోరాట సమితిని ఏర్పాటు చేశామన్నారు. త్వరలో సమితి సమావేశం నిర్వహించి కార్యక్రమాలను ప్రారంభిస్తామని వెల్లడించారు.