రూ. 9 కోట్లతో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం
పనులు పూర్తైతే 7 నుంచి 8 వేల మందికి రెండు రోజులకో సారి మంచినీరు
జూబ్లీహిల్స్, నవంబర్ 9: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అత్యంత ఎత్తైన ప్రాంతంలోని ఎస్పీఆర్హిల్స్ వాసుల నీటి గోస తీరనుంది. చుక్కనీటి కోసం అల్లాడిన ప్రజలకు పుష్కలంగా తాగునీటిని అందించేందుకు ఇక్కడ మరో భారీ రిజర్వాయర్‌ను ఏర్పాటు చేయనున్నారు. మంత్రి కేటీఆర్ హామీ మేరకు ఇక్కడ రిజర్వాయర్ ఏర్పాటు కానున్నది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ల కృషితో ప్రభుత్వం సుమారు రూ.9 కోట్లతో రిజర్వాయర్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనుంది. ప్రస్తుతం ఈ ప్రాంతానికి 1 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేస్తుండగా.. అదనపు రిజర్వాయర్‌తో నాలుగు మిలియన్ లీటర్ల నీటిని పంప్ చేసే అవకాశం ఏర్పడటం ఖాయం. సుమారు 7 నుంచి 8 వేల మందికి రెండు రోజులకోసారి తాగునీరు సరఫరా అవకాశాలతో పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ, బోరబండ, రహమత్‌నగర్ డివిజన్లలో లో ప్రెషర్ సమస్య పూర్తిగా తీరనున్నది.