కీసర, ఫిబ్రవరి 20: ప్రభుత్వ ఆధ్వర్యంలో కీసరగుట్ట మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. ఈనెల 28 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు కీసరగుట్టలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కరపత్రికను ఆలయ చైర్మన్ తటాకం ఉమాపతిశర్మ, కార్యనిర్వహణాధికారి కట్టా సుధాకర్‌రెడ్డి, ఆలయ ధర్మకర్తలు కలిసి ఆదివారం మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వం తరుఫున మూడేండ్లుగా రూ.50 లక్షలు అందిస్తున్నామని, ఈ ఏడాది కూడా ప్రభుత్వం తరుఫున రూ.50 లక్షలు అందజేశామన్నారు.
కీసర గుట్టకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ హరీశ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి క్యూ లైన్లను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఆలయం వారి మీదనే ఉన్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కీసర ఎంపీటీసీ తటాకం నారాయణశర్మ, ఆలయ ధర్మకర్తలు వంగేటి బుచ్చిరెడ్డి, సాయినాథ్‌గౌడ్, నరేశ్‌గౌడ్, భాగ్యలక్ష్మి, రామిడి బాల్‌రెడ్డి, రామిడి బుచ్చిరెడ్డి, రమేశ్‌యాదవ్, వేణుగోపాల్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.