మేడ్చల్, ఫిబ్రవరి20 (నమస్తే తెలంగాణ): రైతులకు వ్యవసాయ శాఖ అందిస్తున్న సేవలను గుర్తించిన ప్రభుత్వం.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు రెండో ర్యాంకును ప్రకటించింది. ర్యాంకుల కేటాయింపు కోసం నాలుగు అంశాలను ప్రాతిపదికన తీసుకుంటున్న ఉన్నతాధికారులు.. జిల్లాలో రైతులకు అందిన సేవల ఆధారంగా ప్రతివారం నుంచి 15 రోజులకు ఒకసారి ర్యాంకులను ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యటిస్తూ.. రైతులకు సేవలు అందిస్తుండటంతో ఇటీవలే ప్రకటించిన ర్యాంకింగ్లో జిల్లాకు రెండో ర్యాంకు దక్కినట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యవసాయాధికారి మేరీ రేఖ తెలిపారు.
జిల్లాలో తగ్గిన వరి విస్తీర్ణం..
ఇతరత్రా పంటలపై రైతులకు కల్పించిన అవగాహన సదస్సులు సత్ఫాలితాలు ఇచ్చాయి. గతేడాది రబీ సీజన్లో 13,201 ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు అయ్యింది. ప్రస్తుత రబీ సీజన్లో ఇప్పటి వరకు 4వేల ఎకరాలకు మించలేదని వ్యవసాయాధికారులు తెలిపారు. వరి నాట్లకు మరో 15 రోజుల గడువు ఉండటంతో అప్పటి వరకు 5 వందల ఎకరాలకు మాత్రమే నాట్లు వేసే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే కూరగాయలు, పండ్లు, పూలసాగు వంటి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టి సారిస్తుండటంతో వరి సాగు తగ్గిందని చెబుతున్నారు.
వందకు 66.7 పాయింట్లు
వ్యవసాయశాఖ రైతులకు అందిస్తున్న సేవలను గుర్తించిన ఉన్నతాధికారులు.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు రాష్ట్ర వ్యాప్తంగా రెండో ర్యాంకును ప్రకటించారు. రైతుబీమా, పంటల నమోదు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందించే విధానాన్ని వారు ప్రాతిపదికన తీసుకుంటున్నారు. వివిధ రకాల సేవల్లో వంద పాయింట్లకు 66.7 పాయింట్లతో జిల్లా రెండో ర్యాంకు దక్కించుకుంది. క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు ఎలాంటి సమస్యలున్నా పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
-మేరీ రేఖ,మేడ్చల్ జిల్లా వ్యవసాయాధికారిణి