దుండిగల్, ఫిబ్రవరి 20: ఏటీఎం కేంద్రాల్లో డబ్బు నింపేందుకు వినియోగించే వాహనం డ్రైవర్ రూ.36 లక్షల నగదుతో ఉడాయించిన విషయం తెలిసిందే. ఆ వాహనం మెదక్ జిల్లా నర్సాపూర్ అటవీ ప్రాంతంలో ఆదివారం ఉదయం లభ్యమైంది. బేగంపేటలోని రైటర్స్ బిజినెస్ సర్వీసెస్ సంస్థ యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలలో నగదును నింపుతుంటుంది. శనివారం సాయంత్రం సూరారం కాలనీ సాయిబాబానగర్ చౌరస్తా వద్ద యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో డబ్బులు జమ చేస్తుండగా, డ్రైవర్ సిరిసిల్లకు చెందిన సాగర్(25) యూటర్న్ తీసుకుంటానని చెప్పి.. వాహనంతో పారిపోయాడు. మూడు టీంలతో కూడిన పోలీసు బృందాలు నిందితుడిని పట్టుకునేందుకు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఈ క్రమంలో నర్సాపూర్ అటవీ ప్రాంతం ప్రధాన రహదారి పక్కన ఆ ఏటీఎం వాహనాన్ని గుర్తించిన పోలీసులు.. దుండిగల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వాహనాన్ని వదిలేసి.. నగదుతో పారిపోయిన సాగర్‌ను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.