రవీంద్రభారతి, ఫిబ్రవరి 20: తెలంగాణ కళలు, కళాకారుల పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం చేయూతనందిస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కేవీ.రమణాచారి అన్నారు. సాంస్కృతిక బంధు సారిపల్లి కొండల్రావు ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతిలో తెలంగాణ జానపద కళలు నగదు పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కేవీ.రమణాచారి, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా బతుకమ్మ, పరుశరాముడి కథ, బంజారా నృత్యం, ఒగ్గుకథ, తదితర వాటిని కళాకారులు ప్రదర్శించారు. అనంతరం ప్రతిభ చూపిన కళాకారులకు నగదు పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో లంకా లక్ష్మీనారాయణ, కూచిపూడి నృత్యగురువు ఎస్పీ భారతి తదితరులు పాల్గొన్నారు.
ఊరుభంగం పోస్టర్ ఆవిష్కరణ
ఊరుభంగం నాటక ప్రదర్శన పోస్టర్ను ఆదివారం రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కేవీ రమణాచారి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మోహన్సేనాపతి, రామకోటేశ్వరరావు, రామశాస్త్రి, నటరాజ్, రామ్మోహన్, హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు.