మేడ్చల్, ఫిబ్రవరి (నమస్తే తెలంగాణ), మేడ్చల్ రూరల్:మేడ్చల్ జిల్లాలో గేట్ వే ఐటీ పార్కు ఏర్పాటుకు సర్వం సన్నద్ధమైంది. గురువారం సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని కండ్లకోయలో 10.11 ఎకరాలల్లో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.250 కోట్ల ప్రభుత్వ నిధులతో 14 అంతస్తులతో నిర్మించనున్న గేట్‌వే ఐటీ పార్కు కు ( రెండు ఐటీ టవర్స్), పూడూరు గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శంకుస్థాపన చేయనున్నారు.
20వేల మందితో బహిరంగ సభ
మేడ్చల్ జిల్లా కండ్లకోయలో ఐటీ టవర్స్, పూడూరులో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు పనులకు మంత్రి కేటీఆర్ గురువారం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సుమారు 20వేల మందితో కండ్లకోయలో ఐటీ టవర్స్ వద్ద నిర్వహించనున్న బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా సభా స్థలి వద్ద జరుగుతున్న ఏర్పాట్లను బుధవారం రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి పరిశీలించారు. సభకు హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తిచేశామని తెలిపారు. మంత్రి వెంట టీఎస్ఐఐసీ అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.
భూమిపూజ ఏర్పాట్ల పరిశీలన
పూడూరు గ్రామంలో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘాల చైర్మన్లు సుధాకర్‌రెడ్డి, సురేశ్ రెడ్డి, రణదీప్‌రెడ్డి, టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, ఎంపీటీసీ సభ్యుడు రఘు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.
శంకుస్థాపన సమయం
ఐటీ టవర్స్ (ఉదయం 10:30 గంటలకు)
ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ ( ఉదయం 11:30 గంటలకు)