కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి16: హోటల్ మేనేజ్మెంట్ చేశాడు…పెద్దపెద్ద స్టార్ హోటళ్లలో ఈవెంట్లు నిర్వహించాడు.. కరోనా కారణంగా దివాళ తీశాడు. వీటికి తోడు తన లగ్జరీ జీవితానికి డబ్బులు సరిపోకపోవడంతో పక్కదారి పట్టాడు. ఈవెంట్ల సమయంలో ఏర్పడిన పరిచయాలతో డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. తాను సేవిస్తూనే.. ఆ మత్తుపదార్థాలే తన సంపాదనకు సులువైన మార్గమని భావించాడు. స్నేహితుడితో కలిసి.. డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. ఆరు నెలలుగా సాగుతున్న ఈ ముఠా గుట్టును మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు రట్టు చేశారు.
జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయ భాస్కర్‌గౌడ్ వివరాలు వెల్లడించారు. జీడిమెట్లకు చెందిన యోగి(26) గతంలో ఈవెంట్లు నిర్వహించేవాడు. గుంటూరు జిల్లా నర్సారావుపేటకు చెందిన స్నేహితుడు మల్లికార్జున్‌రెడ్డి (27)తో కలిసి డ్రగ్స్ దందా మొదలుపెట్టాడు. ఎస్.మాణిక్‌రావు(27) క్యాబ్‌డ్రైవర్, మరో వ్యక్తి దినేశ్‌బాబు(21) ద్వారా చెన్నై, గోవా ప్రాంతాల నుంచి మాదకద్రవ్యాలను దిగుమతి చేసి.. ఆర్డర్లపై సరఫరా చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ అధికారులు కుత్బుల్లాపూర్‌లో వాహనాలను తనిఖీ చేస్తుండగా, మాణిక్‌రావు, దినేశ్ దొరికారు. వారి వద్ద నుంచి 11.759 గ్రాముల కొకైన్, 1.002 గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకొని.. నిందితులను రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిందితులు యోగి, మల్లికార్జున్ పరారీలో ఉన్నారు.