ఖైరతాబాద్, ఫిబ్రవరి 16 : ఆ బాలుడి వయసు ఎంతో చిన్నది. అతను చేసిన దానం వెలకట్టలేనిది. 14 ఏండ్ల వయసుకే నూరేండ్లు నిండగా, అవయవదానంతో ఏడుగురికి కొత్త జీవితాన్ని అందించాడు. మెదక్ జిల్లా శంకరంపేట, టీ మందాపూర్‌కు చెందిన రాములు, మంజుల దంపతుల కుమారుడు గొల్ల లోకేశ్ (14) స్థానికంగా ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 15న స్కూల్‌కు వెళ్తుండగా, మందాపూర్ వద్ద వ్యాను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడిని తల్లిదండ్రులు సోమాజిగూడలోని యశోద దవాఖానకు తరలించారు. చికిత్స అందిస్తున్న న్యూరో ఫిజీషియన్లు బ్రెయిన్ డెడ్‌కు గురైనట్లు నిర్ధారించారు. లోకేశ్ కుటుంబ సభ్యులకు జీవన్‌దాన్ ప్రతినిధులు అవయవదానం విశిష్టతను వివరించారు. వారి అంగీకారంతో ఆ బాలుడి నుంచి కాలేయం, రెండు మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కండ్లను సేకరించారు. పేద కుటుంబమైనా.. పెద్ద మనసుతో అవయవదానికి ముందుకు వచ్చిన ఆ బాలుడి తల్లిదండ్రులను జీవన్‌దాన్ అభినందించింది. అనంతరం ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది బాలుడి పార్థివదేహంపై పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.