హయత్‌నగర్, ఫిబ్రవరి 16: మామను అల్లుడు కత్తితో పొడిచేశాడు. ఈ సంఘటన హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం ఆదర్శ్‌నగర్ కాలనీలో ధరావత్ చందా కుటుంబసభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. తట్టిఅన్నారంలో ఐదేండ్లుగా వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని.. కూరగాయలు పండించి.. విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడి రెండో కుమార్తె శిరీష హయత్‌నగర్‌కు చెందిన రాంబాబును నాలుగేండ్ల కిందట పెండ్లి చేసుకుంది.
ఈ దంపతులకు పాప జన్మించింది. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతుండగా, పెద్దల సమక్షంలో నచ్చజెప్పారు. ఈ క్రమంలో పాపాయిగూడలో ఉంటున్న రాంబాబు, మామ ధరావత్ చందాకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడి.. నాగోల్ రోడ్డు పక్కన కూరగాయలు విక్రయిస్తున్న గుడిసెను తొలగించాడు. బుధవారం సాయంత్రం 5 గంటలకు వ్యవసాయ క్షేత్రం వద్ద చందాను రాంబాబు, ఆంజనేయులు, శశాంక్ అనే వ్యక్తులతో కలిసి కత్తితో పొడిచి పరారయ్యారు. చందాను స్థానికులు హయత్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.