కీసర, ఫిబ్రవరి 16: గోల్డ్ లోన్లకు సంబంధించిన బంగారాన్ని తాకట్టు పెట్టి..వచ్చిన డబ్బులతో బెట్టింగ్‌లకు పాల్పడ్డాడో వ్యక్తి. కీసర సీఐ రఘువీరారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గోల్డ్ లోన్స్ అందించే దమ్మాయిగూడలోని ఐఐఎఫ్ఎల్ అనే సంస్థలో తోట రాజ్‌కుమార్ పనిచేస్తున్నాడు. 63 మంది ఖాతాలకు సంబంధించి పలు దఫాలుగా మొత్తం 14.40 కిలోల బంగారాన్ని మేనేజర్ దృష్టిని మళ్లించి..లాకర్ నుంచి తీసుకున్నాడు. మరో సంస్థలో గిరివి పెట్టి.. వచ్చిన డబ్బులతో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడి.. నష్టపోయాడు.
ఆ కంపెనీ ప్రతినిధి ఫిర్యాదు మేరకు కీసర పోలీసులు తోట రాజ్‌కుమార్‌ను మంగళవారం అరెస్టు చేశారు. విచారణలో పలు ఏరియాల్లో ఉన్న ఓ సంస్థలో బంగారాన్ని తాకట్టు పెట్టి.. మొత్తం రూ.3.30 కోట్ల వరకు డబ్బులు తీసుకున్నానని, జూదంతో పాటు క్రికెట్ బెట్టింగ్‌లకు వాటిని ఉపయోగించానని చెప్పాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని కోర్టుకు రిమాండ్ చేశారు.