సిటీబ్యూరో, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ)/మన్సూరాబాద్/ఎల్బీనగర్: ఎస్ఎన్డీపీ కింద మొదటి దశలో 52 చోట్ల రూ.858 కోట్లతో చేపడుతున్న నాలాల అభివృద్ధి పనులను మూడు నెలల్లో పూర్తి చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. మంగళవారం బండ్లగూడ నుంచి నాగుల చెరువు వరకు చేపట్టిన నాలా అభివృద్ధి పనులను బండ్లగూడ చెరువు వద్ద ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో కలిసి మేయర్ పరిశీలించారు. అనంతరం జోనల్‌స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో రూ.114 కోట్లతో చేపట్టే 10 పనులను మూడు నెలల్లో పూర్తి చేయాలని.. అంత వరకు ఎవరికి సెలవులు ఇవ్వొద్దని సీఈని ఆదేశించారు. టెండర్లు పూర్తి అయిన వెంటనే అన్ని ప్యాకేజీలకు సంబంధించిన పనులను ఒకేసారి ప్రారంభించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. నాలాల అభివృద్ధి పనుల్లో జోనల్ స్థాయి అధికారులు సహకరించాలని కోరారు.
ప్రగతి సమాచారం పంపాలి..
నాలాల పనుల ప్రగతి సమాచారాన్ని ప్రతిరోజు పంపాలని మేయర్ అధికారులకు సూచించారు. నాలాల్లో ఎలాంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని.. ఇందుకోసం కన్సల్టెన్సీని నియమించాలని ఆదేశించారు. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం ద్వారా చేపట్లిన 14 పనుల్లో ఆరు పూర్తి కాగా మరో 7 పనులు వివిధ దశల్లో ఉన్నాయని.. వాటిని వేగవంతం చేసి పూర్తి చేయాలని కోరారు. అక్రమ నిర్మాణాలను సత్వరమే తొలగించేందుకు టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
లింక్‌రోడ్లకు ప్రతిపాదనలివ్వాలి..
ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి లింక్‌రోడ్లకు ప్రతిపాదనలివ్వాలన్నారు. సమర్థవంతమైన పారిశుధ్య నిర్వహణకు సర్కిల్లో రెండో చెత్త సేకరణ పాయింట్‌కు అనువైన స్థల సేకరణ చేయాలని డీసీలను ఆదేశించారు. వైకుంఠధామాలలో వసతుల కల్పనకు కృషి చేయాలని జోనల్ కమిషనర్లను కోరారు. పూడికతీత పనుల్లో కార్పొరేటర్లను భాగస్వామ్యం చేయాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో జోనల్ కమిషనర్ పంకజ, ఎస్ఎన్డీపీ సీఈ కిషన్, ఎస్ఈ శ్రీనివాస్ రెడ్డి ,రవీందర్, ఆయా విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మరుగుదొడ్లు పని చేయకపోతే చర్యలు..
వందకు వంద శాతం మరుగుదొడ్లు పని చేయాలని లేకుంటే అధికారులపై చర్యలు తప్పవన్నారు. ప్రతి మరుగుదొడ్డికి తప్పనిసరిగా డ్రైనేజీ కనెక్షన్ ఉండాలని తెలిపారు. స్వచ్ఛ ఆటోల నిర్వహణలో కార్పొరేటర్లు భాగస్వామ్యం కావాలన్నారు. వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా సహాయ వైద్య ఆరోగ్య అధికారులు కృషి చేయాలని కోరారు. పారిశుధ్య కార్మికులు ఉదయం 10 గంటల తర్వాత కూడా వారికి కేటాయించిన సెచ్ లో పనిచేసేలా చూడాలన్నారు. శానిటేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఈ విషయంలో ఎఎంహెచ్ఓలదే పూర్తి బాధ్యత అని స్పష్టం చేశారు. పారిశుధ్య కార్మికులు తప్పనిసరిగా కిట్స్ ధరించాలని, జవాన్ల పనితీరును మెరుగుపడాలని.. వారికి కూడా బయోమెట్రిక్, డ్రెస్ కోడ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సర్కిల్లో ఉన్న స్వీపింగ్ మిషన్లపై పనితీరుపై డిప్యూటీ కమిషనర్లు తరచూ పర్యవేక్షించాలన్నారు.
నియోజకవర్గ వ్యాప్తంగా ఎస్ఎన్డీపీ పనులు..
ఎస్ఎన్డీపీ పైలెట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గానికి రూ.103 కోట్లు మంజూరయ్యాయని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. బండ్లగూడ, బాతుల చెరువు వరదనీటి నాలా పనులు ఇప్పటికే ప్రారంభం కాగా.. మిగిలిన ప్రాంతాల్లో మరో రెండు రోజుల్లో పనులు ప్రారంభం అవుతాయన్నారు. ప్రతిరోజు 300 మీటర్ల పొడవునా నాలాల తవ్వకాలు జరపాలన్న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. మే నెలాఖరుకు నాలాల పనులు పూర్తి చేసి వరద నీటి ముంపు లేకుండా చేస్తామన్నారు.
– ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి