సిటీబ్యూరో, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): మధ్యప్రదేశ్‌కు చెందిన యూనివర్సిటీ అధికారులతో కలిసి నకిలీ సర్టిఫికెట్ల దందా నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో రెండు వేర్వేరు కన్సల్టెన్సీల నిర్వాహకులతో పాటు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, నకిలీ సర్టిఫికెట్లు తీసుకున్న ఏడుగురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉన్నారు. నగరంలోని సీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వివరాలు వెల్లడించారు.
సిరిసిల్లా జిల్లాకు చెందిన అంచ శ్రీకాంత్‌రెడ్డి దిల్‌సుఖ్‌నగర్‌లో నివాసముంటూ మలక్‌పేట సలీంనగర్ కాలనీలో 2017 నుంచి ‘శ్రీసాయి ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ’ నిర్వహిస్తున్నాడు. వివిధ యూనివర్సిటీల్లో విద్యార్థులకు అడ్మిషన్లు ఇప్పిస్తూ అక్రమ పద్ధతిలో డబ్బు సంపాదించాలని ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్‌లోని సర్వేపల్లి రాధాకృష్ణన్ యూనివర్సిటీ(ఎస్ఆర్కేయూ)లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న కేతన్సింగ్ను పరిచయం చేసుకున్నాడు. తన వద్దకు వచ్చే విద్యార్థులకు వివిధ డిగ్రీలకు సంబంధించిన ఎస్ఆర్కేయూ సర్టిఫికెట్లు కావాలని కోరాడు. విద్యార్థుల వద్ద నుంచి డబ్బులు తీసుకుని పరీక్షలు రాయకుండానే సర్టిఫికెట్లు అందించాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు.
పరీక్ష రాయకుండానే సర్టిఫికెట్
స్కూల్, ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ సర్టిఫికెట్లు కావాల్సిన వారితో పాటు ఆయా కోర్సుల్లో ఫెయిల్ అయిన వారి ఫోన్ నంబర్లను శ్రీకాంత్ రెడ్డి సేకరిస్తుంటాడు. తమ వద్ద చేరితే పరీక్ష రాయకుండానే ఎస్ఆర్కే యూనివర్సిటీ నుంచి సర్టిఫికెట్ ఇప్పిస్తామని తన కన్సల్టెన్సీలోని టెలీకాలర్స్‌తో వారికి ఫోన్ చేయిస్తాడు. పాత తేదీలతో సర్టిఫికెట్లు ఇప్పిస్తామని నమ్మిస్తాడు.
మోసం బయటపడిందిలా..!
శ్రీకాంత్‌రెడ్డి వద్ద తీసుకున్న సర్టిఫికెట్లతో ఓ విద్యార్థి విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. వీసా ప్రాసెసింగ్ చేసే సమయంలో సర్టిఫికెట్లపై అధికారులకు అనుమానం వచ్చి సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్, మలక్‌పేట పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు జరిపి, ఎస్ఆర్కేయూ యూనివర్సిటీకి చెందిన కేతన్సింగ్ను అదుపులోకి తీసుకుని విచారించగా.. యూనివర్సిటీ పెద్దల పాత్ర కూడా ఇందులో ఉన్నట్లు తెలిపాడు. దీంతో యూనివర్సిటీలోని పెద్దల పాత్రపై కూడా ఆరా తీసి అరెస్ట్ చేస్తామని సీపీ వెల్లడించారు.
అంతా కటకటాల్లోకి..!
నకిలీ సర్టిఫికెట్లు పొందిన ఖైరతాబాద్‌కు చెందిన దూంపల్లి శశికాంత్(బీటెక్, సీఎస్ఈ), చింతల్‌కు చెందిన అలుక నిశాంత్‌రెడ్డి(బీటెక్, సీఎస్ఈ), వనస్థలిపురంకు చెందిన కొడాలి సాయికృష్ణ (బీటెక్, సీఎస్ఈ), చిలకలగూడకు చెందిన వెల్టూర్ వినయ్‌కుమార్‌రెడ్డి(బీటెక్, మెకానికల్), సికింద్రాబాద్‌కు చెందిన బద్దం అనురాగ్‌రెడ్డి (బీఎస్సీ, కంప్యూటర్స్), నిజాంపేటకు చెందిన సిరిగిరి యోగానందరెడ్డి(బీఎస్సీ, కంప్యూటర్స్), భువనగిరికి చెందిన మహ్మద్ అల్తాసుద్దీన్ (బీఎస్సీ, కంప్యూటర్)లతో పాటు ప్రధాన సూత్రధారి కేతన్‌సింగ్, శ్రీకాంత్‌రెడ్డిలను అరెస్ట్ చేశారు. వీరి నుంచి రబ్బర్ స్టాంప్‌లు, ఎస్ఆర్కేయూకు చెందిన నకిలీ సర్టిఫకెట్లు, టెలీకాలర్స్‌కు చెందిన సెల్ఫోన్లు, విద్యార్థుల సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాంత్‌రెడ్డిపై గతంలో వరంగల్, మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో కేసులు ఉన్నాయి.
ప్రైడ్ ఎడ్యుకేషనల్ అకాడమీ
దుబ్బాక మండలం రామక్కపేటకు చెందిన గుంటి మహేశ్వర్‌రావు పదో తరగతి పూర్తి చేసి హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో స్థిరపడ్డాడు. ప్రైడ్ ఎడ్యుకేషనల్ అకాడమీ పేరుతో కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. ఎస్ఆర్కేయూ ప్రొఫెసర్ కేతన్‌సింగ్‌తో పాటు మధ్యప్రదేశ్‌లోని స్వామి వివేకానంద, యూపీలోని గ్లోకల్ యూనివర్సిటీలతో సంబంధాలు కొనసాగిస్తున్నాడు. ఆయా యూనివర్సిటీల నుంచి బీటెక్, బీఎస్సీ, బీకాం, ఎంబీఏ, ఎల్ఎల్బీ, బీఈడీ, బీఏ, పీజీడీసీఏలకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లు ఇప్పిస్తున్నాడు. ఈ ఘటనలో మహేశ్వర్‌రావును పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు యూనివర్సిటీలకు సంబంధించిన 28 నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ రబ్బర్ స్టాంపులు, కంప్యూటర్, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
రాష్ట్రంలో నకిలీ సర్టిఫికెట్లకు తావు లేదు : లింబాద్రి
తెలంగాణలో నకిలీ సర్టిఫికెట్లకు తావు లేదని ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి స్పష్టం చేశారు. నకిలీ విత్తనాలను నిర్మూలించినట్లు గానే నకిలీ సర్టిఫికెట్ల విషయంలో వ్యవహరించాలని సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేశారన్నారు. తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీల నుంచి జారీ అయ్యే సర్టిఫికెట్లను ఆన్లైన్లో తనిఖీ చేసుకునే వెసులుబాటు ఉందని, విద్యార్థులు సర్టిఫికెట్లను అప్పటికప్పుడే తనిఖీ చేసుకోవచ్చన్నారు. 15 యూనివర్సిటీల డాటా ఆన్లైన్లో ఉంటుందని చెప్పారు. దేశ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలను ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందని తెలిపారు.
నేరస్తులను వదిలిపెట్టం
ఇక నుంచి కౌన్సెలింగ్‌లు ఉండవని, తెలిసి నేరం చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని సీపీ ఆనంద్ హెచ్చరించారు. నకిలీ సర్టిఫికెట్లు పొందిన విద్యార్థుల తల్లిదండ్రులను అరెస్ట్ చేస్తామన్నారు. అలాగే యూనివర్సిటీలోని అధికారుల పాత్రపై లోతైన దర్యాప్తు చేసి పాత్రదారులందరినీ అరెస్ట్ చేస్తామన్నారు. తెలంగాణలో వ్యవస్థీకృత నేరాలకు తావు లేదన్నారు. నకిలీ సర్టిఫికెట్ల దర్యాప్తునకు ఈస్ట్‌జోన్ జాయింట్ సీపీ రమేశ్, వెస్ట్‌జోన్ డీసీసీ జోవెల్ డేవీస్ల నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సుమారు 700మంది ఈ యూనివర్సిటీల నుంచి నకిలీ సర్టిఫికెట్లు పొందినట్లు తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ సీపీ రమేశ్, టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
బీటెక్ సర్టిఫికెట్‌కు రూ.3 లక్షలు
బీటెక్‌కు రూ.3లక్షలు, బీఎస్సీకి రూ.1.70 లక్షలు, బీకాంకు రూ.1.5 లక్షలు, ఇతర కోర్సులకు రూ. 1.5 లక్షల వరకు వసూలు చేస్తారు. వచ్చిన మొత్తంలో 30శాతం తాను తీసుకొని, మిగతా డబ్బు, సర్టిఫికెట్ల వివరాలను కేతన్‌సింగ్‌కు పంపిస్తాడు. కేతన్ సింగ్ అక్కడి యూనివర్సిటీ ఉన్నతాధికారులకు ఎవరి వాటాలు వాళ్లకు పంపిస్తాడు. అక్కడినుంచి వచ్చిన ఆయా సర్టిఫికెట్లను శ్రీకాంత్‌రెడ్డికి పంపిస్తాడు.