జీడిమెట్ల, ఫిబ్రవరి 15 : ప్రేమికుల రోజున ఘోరం జరిగింది. అనుమానాస్పదస్థితిలో బహుళ అంతస్తుల నిర్మాణ ప్రదేశంలో ఓ మైనర్ బాలిక మృతదేహం లభ్యమైంది. జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం కలకలం రేపిన సంఘటన హత్యా.., ఆత్మహత్యా.. అనేది తేలాల్సి ఉన్నది. సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. సుభాష్‌నగర్ ప్రాంతానికి చెందిన బచ్చన్సింగ్, పూర్ణంకౌర్ దంపతులకు ఐదుగురు పిల్లలు. వీరి పెద్ద కుమార్తె(17) ఆరవ తరగతి వరకు చదువుకున్నది. అనంతరం చదువు మానేసి ఇంటి వద్దనే ఉంటుంది. సోమవారం రాత్రి 10 గంటలకు బాలిక ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు.
ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు బాలిక కోసం చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో రాత్రి ఒంటిగంట సమయంలో జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో సుభాష్‌నగర్ పైపులైన్రోడ్డులోని ఓ బార్పక్కనే నిర్మాణదశలో ఉన్న బహుళ అంతస్తు భవనం కింద మృతదేహం ఉన్నట్లు వాచ్మెన్ అమ్రిత్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఆ బాలిక గాంధీ ఆస్పత్రికి తరలించారు. తమ కూతురిని ఎవరో కావాలనే చంపేసి ఇక్కడ వదిలేసి వెళ్లారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీంతో పలు అనుమానాలకు తావిస్తున్నది.