మహేశ్వరం, ఫిబ్రవరి 15 : కూరగాయలు అమ్ముతూ కనిపించిన బాలుడు.. పూలబొకేతో మంత్రికి స్వాగతం పలికాడు. చక్కగా చదువుకుంటానని హామీ ఇచ్చాడు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఈనెల 7న మంత్రి సబితారెడ్డి పర్యటిస్తుండగా కౌషిక్ అనే బాలుడు కూరగాయలు అమ్ముతూ కనిపించాడు. ఆరాతీయగా మహేశ్వరం మండలం కేసీ తండా మోడల్ స్కూల్లో 6వ తరగతిలో పేరు నమోదైనప్పటికీ బడికెళ్లకుండా కూరగాయలు విక్రయిస్తున్నట్లు తేలింది. బడికెళితే భవిష్యత్తు బాగుంటుందని మంత్రి సూచించడంతో తెల్లారినుంచి కౌషిక్ పాఠశాలకెళ్తున్నాడు. మంగళవారం కేసీ తండా మోడల్స్కూల్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్, పండ్లు పంపిణీ చేసేందుకు హాజరైన మంత్రికి కౌషిక్ స్వయంగా బొకే అందజేసి స్వాగతం పలుకగా..వెల్డన్ బాయ్ అని ప్రశంసించారు.