హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): అనాథ బాల బాలికల కోసం నాంపల్లిలో నిర్మిస్తున్న అనీసుల్ గుర్బా పనులను మరింత వేగవంతం చేయాలని, రంజాన్ నాటికి మొదటి దశ పూర్తి కావాలని సంబంధిత అధికారులను షెడ్యూల్ కులాలు, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు. ఎంఐఎం శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, వక్ఫ్ బోర్డు చైర్మన్ సలీంతో కలిసి అనీసుల్ గుర్బా పనులను క్షేత్రస్థాయిలో మంత్రి కొప్పుల మంగళవారం పరిశీలించారు. అనంతరం, సంబంధిత ఉన్నతాధికారులతో పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ, అనాథ బాల బాలికలకు ఆశ్రయం కల్పించేందుకు నిజాం కాలంలో ప్రారంభించిన అనీసుల్ గుర్బాకు ప్రభుత్వం రూ.39 కోట్లతో అధునాతన వసతులను కల్పిస్తున్నదని వివరించారు. మొత్తంగా కరోనా కారణంగా పనుల్లో కొంత జాప్యం జరిగిందని అన్నారు.
ఈ నేపథ్యంలో పనుల్లో వేగం పెంచి రంజాన్ నాటికి మొదటి దశ పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఆ తరువాత రెండు నెలల్లో పనులన్నింటినీ పూర్తి చేయాలని సూచించారు. ఆశ్రమానికి సంబంధించి బజార్‌ఘాట్, గన్‌ఫౌండ్రి తదితర చోట్ల ఉన్న ఆస్తుల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆశ్రమంలో వసతి పొందుతున్న 600 మంది బాల బాలికలకు అన్ని వసతులు కల్పించాలని, 5వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం నిర్వహించాలని తెలిపారు. సమావేశంలో మైనార్టీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, ముఖ్య కార్యదర్శి నదీమ్ అహ్మద్, వక్ఫ్ బోర్డు డైరెక్టర్ షానవాజ్ ఖాసీం, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్యా దేవరాజన్ పాల్గొన్నారు.