బంజారాహిల్స్, ఫిబ్రవరి 15: క్యాన్సర్ అంటే భయపడాల్సిన అవసరం లేదని, సరైన చికిత్స పొంది ఆరోగ్యా న్ని పొందవచ్చని ప్రముఖ సినీ నటుడు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ రోగులలో భరోసా నింపారు. చిన్న పిల్లల క్యాన్సర్ అవగాహన దినాన్ని పురస్కరించుకుని బంజారాహిల్స్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు. క్యాన్సర్ మహమ్మారి బారినపడి పోరాడుతున్న చిన్నారులకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా, విజేతలకు బాలకృష్ణ బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, క్యాన్సర్‌ను జయించిన చిన్న పిల్లలు, ఇతర రోగుల్లో స్ఫూర్తిని నింపుతున్నారన్నారు. క్యాన్సర్ అంటే భయపడకుండా చికిత్స పొంది పూర్తిగా ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చనే విషయాన్ని గురించి ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సందర్భంగా చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ను నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సీఈవో డాక్టర్ ఆర్వీ ప్రభాకర్ రావు, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ టీఎస్ రావు, డాక్టర్ సెంథిల్ రాజప్ప, డాక్టర్ కల్పనా రఘునాథ్, రోటేరియన్ డాక్టర్ శిరీష్, శ్రీనివాస్, సుబ్బారావు, మల్లిక్, తదితరులు పాల్గొన్నారు.