సిటీబ్యూరో, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): వెబ్‌సిరీస్‌లో వచ్చిన ఓ క్రైమ్ స్టోరీని స్ఫూర్తిగా తీసుకొని తెలుగు రాష్ర్టాల్లో కిడ్నాప్‌లు చేస్తున్న ఘరానా ముఠాను ఆసిఫ్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను మంగళవారం నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, వెస్ట్‌జోన్ డీసీపీ జోయెల్ డేవీస్‌తో కలిసి వెల్లడించారు. భోజగుట్టకు చెందిన గుంజపోగు సురేశ్ అలియాస్ సూర్య కరుడుగట్టిన దొంగ గుంజపోగు సుధాకర్‌కు సోదరుడు. సురేశ్‌పై గతంలో వివిధ నేరాలకు సంబంధించి 14 కేసులున్నాయి. డిసెంబర్ 2019లో మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేయగా, ఫిబ్రవరి 2020లో జైలు నుంచి బయటకు వచ్చాడు. నెట్‌ఫ్లెక్స్‌లో ప్రసారమైన మనీ హీస్ట్ వెబ్‌సిరీస్‌లో ఒక ప్రొఫెసర్ నేరాలు చేసేందుకు ఉద్యోగులను నియమించుకొని, నేరాలు చేసే విధానాన్ని స్ఫూర్తిగా తీసుకున్న సురేశ్ తాను కూడా ఓ కిడ్నాప్ డాన్‌గా ఎదుగాలని ఫ్లాన్ చేశాడు. ఇందులో భాగంగా భోజగుట్టకు చెందిన రోహిత్, ఇందురి జగదీశ్, కె.కునాల్, జగద్గిరిగుట్టకు చెందిన శ్వేతాచారి అలియాస్ స్వీటిని నియమించుకున్నాడు. కిడ్నాప్ కోసం పజేరో కారు ఏపీ09బీఆర్ 4786ను ఉపయోగించేవాడు.
ఏం చేసేవారంటే..!
డబ్బున్న వారిని ఈ ముఠా ఎంపిక చేసుకుంటుంది. ఎంపికైన వారితో స్వీటి పేరుతో శ్వేతాచారి పరిచయం చేసుకునేది. కొన్నాళ్ల పాటు చాటింగ్ చేసి ముగ్గులోకి దింపుతుంది. పగటి పూట వీడియో కాల్స్‌లో మాట్లాడుతుంది, రాత్రి వేళల్లో ఆ ఫోన్ సురేశ్ వద్ద ఉంటుంది. ఆ సమయంలో కాల్స్ వస్తే ఇంట్లో అందరూ ఉన్నారంటూ దాటవేస్తుంటారు. కొన్నాళ్లు ఇలా చాటింగ్ చేసి ఆ తరువాత ఒక చోట కలుద్దామంటూ పిలిపిస్తుంది. అప్పటికే అక్కడ ముఠా ఎదురు చూస్తూ ఉంటుంది. టార్గెట్ చేసిన వ్యక్తిని పట్టుకొని నోట్లో గుడ్డలు కుక్కి కారులో బంధిస్తారు. బాధితుడి సెల్‌ఫోన్ నుంచి అతడి కుటుంబ సభ్యులకు వాట్సాప్ కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తారు. డబ్బులు ఇవ్వకపోతే మీ వాడిని చంపేస్తామంటూ బెదిరింపులకు దిగుతారు. డబ్బులు వచ్చే వరకు కారులోనే తిరుగుతూ ఉంటారు. సెల్‌ఫోన్‌కు ఇంటర్నెట్ను నేరుగా వాడకుండా ముఠాలోని ఓ నంబర్‌తో హాట్‌స్పాట్ కనెక్ట్ చేసి ఉపయోగిస్తుంటారు. మాట్లాడిన వెంటనే మొబైల్ ఫోన్‌ను ఫ్లైట్‌మోడ్‌లో పెట్టేస్తారు. కిడ్నాప్‌నకు బయపడి బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు డబ్బులిచ్చి బాధితులను విడిపించుకుంటారు. వచ్చినదాంట్లో ప్రధాన వాటా సురేశ్ తీసుకొని, మిగతా వారికి కొంత అందిస్తాడు.
వెలుగులోకి వచ్చిందిలా…!
గుడిమల్కాపూర్ పువ్వుల మార్కెట్లో ఉండే ప్రశాంత్ ఈ నెల 5న బయటకు వెళ్లి తిరిగి రాలేదు. తల్లి ఉషానమ్మ సాయంత్రం ఫోన్ చేయగా.. స్విచాఫ్ వచ్చింది. రాత్రంతా వెతికినా ఆచూకీ దొరకక పోవడంతో ఆసిఫ్‌నగర్ పోలీసులకు మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఫిర్యాదు చేసింది. 3.30 గంటల ప్రాంతంలో బాధితుడి సోదరుడు ఆంజనేయులు సెల్‌ఫోన్‌కు ప్రశాంత్ సెల్‌ఫోన్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. మీ తమ్ముడిని కిడ్నాప్ చేశాం, డబ్బులిస్తే వదిలేస్తామంటూ బెదిరించాడు. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో కేసును సీరియస్‌గా తీసుకున్నారు. సీపీ సీవీ ఆనంద్ వెంటనే ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. డీసీపీ జోయెల్ డేవిస్ నేతృత్వంలో ఆసిఫ్‌నగర్ ఏసీపీ శివమారుతీ ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించి ముఠా గుట్టును రట్టుచేశారు. విశ్వసనీయ సమాచారంతో సూత్రధారి సురేశ్‌తో పాటు మిగతా సభ్యులను అరెస్ట్ చేశారు. శ్వేత పరారీలో ఉన్నది.
తెలుగు రాష్ర్టాల్లో కిడ్నాప్‌లు
ముఠా నాయకుడు సురేశ్‌ను విచారించడంతో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు ఆరుగురిని కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేసినట్లు తెలిపారు. ఒక కేసులో శంషాబాద్ వద్ద ఓఆర్ఆర్పై నిలబడి, రోడ్డు కింద ఉన్న బాధితుల వద్ద నుంచి తాడు సహాయంతో డబ్బులు తీసుకున్నాడు. ఒక్కో కేసులో ఒక్కో రకంగా వసూలు చేస్తుంటాడు. ఒక కేసులో రూ.8 లక్షలు కూడా వసూలు చేసినట్లు తెలిపారు. ఇలా మొత్తం రూ.20 లక్షల వరకు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. అయితే యువతితో చాటింగ్, ఫోన్లో మాట్లాడిన విషయాలు బయటకు వస్తే పరువు పోతుందనే భయంతో ఈ కిడ్నాప్ వ్యవహారాన్ని బాధితులు బయటకు చెప్పుకోలేకపోయారని పోలీసుల విచారణలో తేలింది. సదాశివపేట, లంగర్‌హౌస్, జీడిమెట్ల, తెనాలి రూరల్, ఆసిఫ్‌నగర్, రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ల పరిధిలో చేసిన కిడ్నాప్ వివరాలు వెలుగులోకి వచ్చాయి.