ఒక్కసారి సరదాకు డ్రగ్స్‌ను టచ్ చేసినా మిమ్మల్ని వదలదు. అలవాటుగా మారితే జీవితం పూర్తిగా అంధకారంలో ఉండిపోతుంది. డ్రగ్స్‌ను దగ్గరికి రానీయకండి. డ్రగ్స్ సరఫరా చేసేవారితో పాటు వినియోగించే వారిని వదిలిపెట్టేది లేదు. డ్రగ్స్‌ను పారదోలకపోతే అది సమాజంపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందు తూ విశ్వనగరంగా పేరు గడిస్తున్న హైదరాబాద్‌ను మాదకద్రవ్య రహిత నగరంగా మార్చేందుకు ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరిస్తున్నది. డ్రగ్స్ క్రయవిక్రయాలపై నిఘా పెట్టేందుకు టాస్క్‌ఫోర్స్ తరహాలో హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్‌న్యూ), నార్కోటిక్ ఇన్వెస్టిగేషన్ సూపర్విజన్ వింగ్ (ఎన్‌ఐఎస్‌డబ్ల్యూ) విభాగాలను ప్రారంభించింది. నగరంతో పా టు దేశాన్ని డ్రగ్స్ బారి నుంచి కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ చేయీచేయీ కలపాలి. డ్రగ్స్ అమ్మకం, వాడకందారుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలి.
– సీపీ సీవీ ఆనంద్
మాదక ద్రవ్యాలు లేని నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దే లక్ష్యంతో పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారు. నగరవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సోమవారం బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణమండపంలో అరోరా, అంబేద్కర్ కాలేజీలు, చిక్కడపల్లి పోలీసుల సంయుక్తాధ్వర్యంలో డ్రగ్స్ వినియోగం, దుష్పరిణామాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీ సీవీ ఆనంద్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి బాగ్‌లింగంపల్లిలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల నిర్మూలనకు తమ వంతు కృషి చేస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.
సిటీబ్యూరో, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ)/ముషీరాబాద్/చిక్కడపల్లి : డ్రగ్స్ సరఫరా చేసే వారితోపాటు వినియోగించే వారినీ వదిలిపెట్టేది లేదని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరించారు. మాదక ద్రవ్యాలు లేని నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సిటీ పోలీసులు నగరవ్యాప్తంగా డ్రగ్స్ వాడొద్దని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం బాగ్‌లింగంపల్లి ఆర్టీసీ కల్యాణమండపంలో అరోరా కాలేజ్, అంబేద్కర్ కాలేజీలు, చిక్కడపల్లి పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో డ్రగ్స్ వినియోగం, దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది. అంతకుముందు విద్యార్థులు, యువతతో కలిసి సీపీ సీవీ ఆనంద్ బాగ్‌లింగంపల్లిలో ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో తెలంగాణ రాష్ర్టాన్ని డ్రగ్స్ రహితంగా తీర్దిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారని చెప్పారు. మాదక ద్రవ్యాలను పూర్తిస్థాయిలో అణిచివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి మందితో కొత్త విభాగాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. హైదరాబాద్‌లో డ్రగ్స్ క్రయ విక్రయాలు చేసే వారు వినియోగించే వారిపై నిరంతరం నిఘా కోసం టాస్క్‌ఫోర్స్ తరహాలో హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్(హెచ్‌న్యూ), నార్కోటిక్ ఇన్విస్టిగేషన్ సూపర్విజన్ వింగ్ (ఎన్‌ఐఎస్‌డబ్ల్యూ) రెండు సరికొత్త విభాగాలను ప్రారంభించామని తెలిపారు. డ్రగ్స్‌పై కలిసికట్టుగా పోరాటం చేయాలని, డ్రగ్స్ వాడే వారి సమాచారాన్ని పోలీసులకు ఇవ్వాలని సూచించారు. డ్రగ్స్‌పై క్షేత్ర స్థాయి వరకు అవగాహన తీసుకొచ్చేందుకు ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలోని బస్తీలు, కాలనీలలో పోస్టర్లను ప్రదర్శిస్తూ రెండు నెలల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సీపీ తెలిపారు.
ఈ సందర్భంగా మాదక ద్రవ్యాలు లేని నగరంగా తీర్చిదిద్దడంలో తమ వంతు సహకారం అందిస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం అరోరా విద్యాసంస్థల యజమాన్యం సీపీ సీవీ ఆనంద్‌ను సన్మానించింది. ఈ కార్యక్రమంలో అరోరా విద్యా సంస్థల కార్యదర్శి నిమ్మటూరి రమేశ్ బాబు, ఆకెళ్ల రాఘవేంద్ర, డాక్టర్ జయరామిరెడ్డి, డాక్టర్ జవహర్లాల్ నెహ్రు, చిక్కడపల్లి ఏసీపీ శ్రీధర్, సీఐ సంజయ్, కళాశాల ప్రిన్సిపాల్ విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.
పంజాబ్‌లో పరేషాన్
పంజాబ్ రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా ప్రధాన పట్టణాల నుంచి చిన్న చిన్న నగరాలు, గ్రామాల వరకు పాకిపోయింది. నాకు తెలిసిన ఐఏఎస్, ఐపీఎస్‌ల పిల్లలు కూడా డ్రగ్స్‌కు అలవాటు పడ్డారు. ఇప్పుడు వారి తల్లిదండ్రులు పిల్లల గూర్చి ఆందోళన చెందుతున్నారు.
ఫ్యాషన్‌గా అలవాటై..
డ్రగ్స్ మొదట ఫ్యాషన్‌గా ప్రారంభమై.. నెమ్మదిగా అలవాటుగా మారి.. తరువాత బానిస కావడం చక చకా జరుగుతుంది. ఇటీవల అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లర్‌ను అరెస్ట్ చేసి అతనితో సంబంధాలు కొనసాగించిన 9 మంది బడా వ్యాపారులను అరెస్ట్ చేశాం. వారంతా ముందుగా ైస్టెల్ కోసం డ్రగ్స్‌ను ఉపయోగించి తరువాత బానిసయ్యారు. కుటుంబసభ్యుల సహకారంతో వారిలో మార్పు తెస్తున్నాం. జైలు నుంచి విడుదలైన తరువాత డ్రగ్స్ వాడమని సదరు వ్యాపారులు హామీ ఇచ్చారు.
నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ టీంలోకి విద్యార్థులు
డ్రగ్స్ సరఫరా, అమ్మకాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే బాధ్యతతో వెంటనే స్థానిక పోలీసులు, నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్, టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందించాలి. డ్రగ్స్ నిర్మూలన కోసం పని చేస్తున్న నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ టీంలో విద్యార్థులు భాగస్వాములు కావాలి. కలిసికట్టుగా పని చేస్తేనే డ్రగ్స్ ఫ్రీ సిటీని తీర్చిదిద్దుతాం.
– డీసీపీ రాజేశ్చంద్ర
విచక్షణ కోల్పోవద్దు
విద్యార్థులు, యువత యవ్వనంలో సరదా కోసం తెలియకుండానే చెడు అలవాట్ల వైపు ఆకర్షితులవుతారు. దీనికి సినిమాలు, స్నేహితుల ప్రభావం ఉండడం సహజం. కానీ ఎప్పుడూ విచక్షణను కోల్పోవద్దు. చెడు అలవాట్లపై మనసులాగితే మనిషిగా ప్రవర్తించడం మరవకండి. మంచి వైపు వెళ్లడం వ్యక్తిగత బాధ్యత.
– ఆకెళ్ల రాఘవేంద్ర, వ్యక్తిత్వ వికాస నిపుణుడు
తల్లిదండ్రుల మాట వినాలి
ఎక్కడ పిల్లలు తల్లిదండ్రుల మాట వింటారో అక్కడ విద్యార్థులు లక్ష్యాన్ని సాధిస్తారు. ఇందుకు సీపీ సీవీ ఆనంద్ కొడుకే ఉదాహరణ. అతను అండర్ 19 వరల్డ్ కప్ ఆడి, ఇపుడు ఐపీఎల్‌కు ఎంపికయ్యాడు. తల్లిదండ్రులు చెప్పింది వింటే తప్పకుండా పైకి వస్తారు.
– విశ్వనాథం బులుసు, అరోరా కళాశాల ప్రిన్సిపాల్