హైదరాబాద్ ఆట ప్రతినిధి, ఫిబ్రవరి 14: జాతీయ అంతర్ క్లబ్ బేస్‌బాల్ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను పంజాబ్ లయన్స్ జట్టు సొంతం చేసుకోగా, ఫేమస్ బేస్‌బాల్ క్లబ్ చండీగఢ్, హైదరాబాద్ ఛార్జర్స్ జట్టు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. శామీర్‌పేట ఇంగ్లిష్ క్రికెట్ మైదానంలో సోమవారం అఖిల భారత ప్రొఫెషనల్ బేస్‌బాల్ సాఫ్ట్‌బాల్ సమాఖ్య, తెలంగాణ బేస్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో టోర్నీ ఘనంగా ముగిసింది. పంజాబ్ లయన్స్ జట్టు రెండు పరుగుల తేడా ఫేమస్ క్లబ్ చండీగఢ్‌పై గెలుపొందింది. పంజాబ్ లయన్స్ జట్టు 11 పరుగులు చేయగా, ఫేమస్ క్లబ్ చండీగఢ్ తొమ్మిది పరుగులు చేసింది. మూడో స్థానానికి జరిగిన పోటీలో హైదరాబాద్ ఛార్జర్స్ జట్టు నాలుగు పరుగుల ఆధిక్యంతో అమరావతి క్లబ్ ఏపీ జట్టు పై విజయం సాధించింది. హైదరాబాద్ ఛార్జర్స్ జట్టు ఎనిమిది పరుగులు చేసింది. నరేందర్-2, సాయిరామ్-2, శ్రీకాంత్, సందీప్, నర్సింగ్, సాయి సంతోష్‌లు ఒక పరుగు చొప్పున చేశారు. అమరావతి క్లబ్ నాలుగు పరుగులు చేసింది. విజేతలకు టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ శ్రీకృష్ణ యెదుల, సీపీబీఎస్సీ సీఈఓ వంశీ కొంరెడ్డి, తెలంగాణ బేస్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఎల్.రాజేందర్ బహుమతులు అందజేశారు.